రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజులు భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో.. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పర్యటనలో సుఖోయ్ Su57 స్టెల్త్ ఫైటర్ జెట్‌లు, ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సహా ప్రధాన రక్షణ ఒప్పందాలపై చర్చలు జరుగుతాయని ధృవీకరించారు. పుతిన్ భారత పర్యటనలో సు-57 అంశం ఎజెండాలో ఉంటుందనడంలో తనకు ఎటువంటి సందేహం లేదన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాల్లో మూడోవ్యక్తి జోక్యాన్ని లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పరస్పర ప్రయోజనం చేకూర్చే వాణిజ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవాలన్నారు.
భారత్‌లో జరిగిన రెడ్ ఫోర్ట్ ఉగ్రదాడిని ఖండిస్తూ, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో రష్యా భారత్‌కు మద్దతు ఇస్తుందని పెస్కోవ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉగ్రవాదుల చేతుల్లో రష్యా చాలా బాధపడింది. ఉగ్రచర్యల వల్ల ప్రజలను కోల్పోయిన బాధ తమకు తెలుసన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆంక్షల సవాళ్లు ఉన్నప్పటికీ, భారతీయ పెట్టుబడిదారులకు అనుకూలమైన పరిస్థితులను కల్పించడానికి రష్యా సిద్ధంగా ఉందని పెస్కోవ్ తెలిపారు.
►ALSO READ | ఉద్యోగం చేస్తూ 30% పన్ను కడుతున్నారా..? ధనవంతుల 'టాక్స్ సీక్రెట్' ఇదే..
ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి భారత్ తీసుకున్న ‘చాలా స్నేహపూర్వక వైఖరి’ పట్ల రష్యా కృతజ్ఞతలు తెలిపింది. ప్రపంచ సమస్యలపై భారత్ స్వతంత్ర విధానాన్ని, ప్రధాని మోదీతో అధ్యక్షుడు పుతిన్ నిరంతర సంభాషణను పెస్కోవ్ మెచ్చుకున్నారు. ఇండియా నుంచి కొంటున్న వాటి కంటే రష్యా నుంచి దిగుమతులు భారత్ లోకి ఎక్కువగా ఉండటంపై ఆందోళన చెందుతున్న సంగతి తమకు తెలుసన్నారు. అందుకే తాము భారత్ నుండి దిగుమతులను పెంచడానికి అవకాశాలను కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు పెస్కోవ్.
