ఆ ఐదుగురు పిల్లలు ఏమయ్యారు..ఇప్పటికీ మిస్టరీనే...

ఆ ఐదుగురు పిల్లలు ఏమయ్యారు..ఇప్పటికీ మిస్టరీనే...

అనుకోకుండా పెద్ద ఫైర్‌‌‌‌ యాక్సిడెంట్ జరిగింది ఆ ఇంట్లో. ఆ టైమ్​లో ఇంట్లో పదకొండు మంది ఉన్నారు. అందులో ఆరుగురు తప్పించుకున్నారు. ఇల్లు పూర్తిగా కాలిపోయింది. తర్వాత చూస్తే శవాలు కాదు కదా.. చిన్న ఎముక కూడా దొరకలేదు. మరి వాళ్లు ఏమైనట్టు. పోనీ ఆ  యాక్సిడెంట్‌‌ నుంచి బయటపడ్డారా? అంటే మళ్లీ తిరిగి అక్కడికి రాలేదు. మరి వాళ్లు ఆ ఇంట్లో నుంచి ఎలా మాయమయ్యా? అనేదే మిస్టరీ. 

దాదాపు 75ఏళ్ళ కిందట.. అమెరికాలోని వెస్ట్‌‌ వర్జీనియాలో జార్జ్‌‌ ఫ్యామిలీ ఉండేది. 1945లో డిసెంబర్‌‌‌‌ 24న అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో అందరూ నిద్ర మత్తులో ఉన్నారు. అది రెండంతస్తుల బిల్డింగ్‌‌. కింది అంతస్తులో ఇద్దరు దంపతులు, వాళ్ల పిల్లలు నలుగురు పడుకున్నారు. పై అంతస్తులో ఐదురుగు పిల్లలు పడుకున్నారు. సరిగ్గా అదే టైంలో ఒక్కసారిగా ఇల్లు మొత్తం మంటలు అలుముకున్నాయి. వెంటనే జార్జ్‌‌ నిద్రలేచి, తన భార్య, చిన్న కూతురితోపాటు బయటకొచ్చాడు. పై అంతస్తులో ఉన్న పిల్లల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ.. మెట్లు పూర్తిగా మంటల్లో కాలిపోవడంతో పైకి వెళ్లలేకపోయాడు. వాళ్లను కాపాడేందుకు ఇంటి వెనకాల ఉన్న మరో దారి నుంచి వెళ్లే ప్రయత్నం చేసినా  లాభం లేకుండాపోయింది. దాంతో ఇంటి వెనుక ఉన్న హైడ్రాలిక్ బొగ్గు ట్రక్కు ద్వారా పై అంతస్తు బెడ్‌‌ రూం కిటికీ నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ.. ఆ ముందురోజు వరకు బాగా పనిచేసిన ఆ ట్రక్‌‌ అప్పుడు మాత్రం స్టార్ట్‌‌ అవ్వలేదు. దాంతో చివరి ప్రయత్నంగా రెయిన్ బారెల్‌‌లోని నీళ్లతో మంటలు ఆర్పేందుకు ట్రై చేశాడు. కానీ.. అందులో ఉన్న నీళ్లు అప్పటికే చలికి గడ్డ కట్టాయి. దాంతో పక్కింట్లోకి వెళ్లి ఫైర్‌‌‌‌ స్టేషన్‌‌కు కాల్‌‌ చేశారు. కానీ.. రెస్పాన్స్ రాలేదు. దాంతో ఇంటి పక్కాయన నేరుగా ఫైర్‌‌‌‌ స్టేషన్‌‌కు వెళ్లి రిక్వెస్ట్‌‌ చేశాడు. వాళ్లు వెంటనే బయల్దేరి వస్తామని చెప్పి అతన్ని పంపేశారు. కానీ.. రెండున్నర మైళ్ల దూరంలో ఉన్న ఆ ఇంటికి వాళ్లు చేరేసరికి ఉదయం ఎనిమిది గంటలు అయ్యింది. అప్పటికే ఆ ఇల్లు బూడిదైపోయింది. తర్వాత ఫైర్‌‌‌‌ డిపార్డ్‌‌మెంట్‌‌ చీఫ్‌‌ ఆఫీసర్‌‌‌‌ మోరీస్‌‌ ఈ యాక్సిడెంట్‌‌ షాట్‌‌ సర్క్యూట్ వల్ల జరిగింది. అందులో ఐదుగురు పిల్లలు చనిపోయారని చెప్పాడు. స్టేట్‌‌ పోలీస్‌‌ ఆఫీసర్ కూడా అదే చెప్పాడు. దాంతో జార్జ్ ఈ స్థలాన్ని స్మారక చిహ్నంగా మార్చాలనే ఉద్దేశంతో బేస్‌‌మెంట్‌‌ కట్టేందుకు ఐదడుగుల వరకు మట్టి పోయించాడు. ఆ ఐదుగురు పిల్లలు చనిపోయినట్లు గవర్నమెంట్‌‌ సర్టిఫికెట్లు ఇచ్చింది. ఇందులో మిస్టరీ ఏముంది అంటారా? ఇక్కడే మొదలైంది అసలు కథ.

వారి శవాలు ఏమయ్యాయి? 

పై అంతస్తులో ఉన్న మారిస్ (14), మార్తా (12), లూయిస్(9), జెన్నీ(8), బెట్టీ(5) మంటల్లో కాలిపోయారని అందరూ నమ్మారు. కానీ.. అందుకు కావాల్సిన ఆధారాలు మాత్రం జార్జ్‌‌కి దొరకలేదు. ఎందుకంటే అందులో ఒక్కరి శవం కూడా దొరకలేదు. ఒకవేళ శరీరం మంటల్లో కాలిపోయింది అనుకున్నా కనీసం ఎముకలైనా దొరకాలి. కానీ.. ఒక్క ఎముక ముక్క కూడా ఆ బూడిదలో దొరకలేదు. పోనీ ఎముకలు కూడా బూడిదయ్యాయి అనుకుంటే.. బూడిదయ్యేంతసేపు మంటలు మండలేదు. బాడీని 2,000 డిగ్రీల దగ్గర దాదాపు రెండు గంటలకు పైగా కాల్చినా ఎముకలు పూర్తిగా బూడిదవ్వవు. అలాంటిది వాళ్ల ఇల్లు కేవలం 45 నిమిషాల్లోనే కాలిపోయింది. అలాంటప్పుడు ఎముకలు ఎలా బూడిదవుతాయి. అలా కాకపోతే వాళ్ల ఎముకలు ఏమయ్యాయి? 

ముందే తెలుసా? 

ఈ ఇంటికి ఫైర్‌‌‌‌ యాక్సిడెంట్‌‌ జరగడానికి కొన్ని రోజుల ముందు కొన్ని అనుమానించాల్సిన ఇన్సిడెంట్లు జరిగాయి. కొన్ని నెలల క్రితం ఆ ఇంటికి ఒక అపరిచితుడు పని కోసం వచ్చాడు. అతను తిరిగి వెళ్తూ మెయిన్‌‌ పవర్‌‌‌‌ సప్లై దగ్గరున్న ఫ్యూజ్ బాక్సులను చూపించి.. ‘‘ఇది ఏదో ఒకరోజు మంట పుట్టిస్తుంది” అని చెప్పాడు. అతని మాటలకు జార్జ్ ఆశ్చర్యపోయాడు. వెంటనే లోకల్‌‌గా ఉండే ఒక కంపెనీతో వైరింగ్‌‌ చెక్‌‌ చేయించాడు. ఎలక్ట్రీషియన్లు అన్నీ చెక్‌‌ చేసి, ఏ సమస్యా లేదని చెప్పారు. అదే టైంలో అక్కడికి మరో వ్యక్తి. అతను జీవిత బీమా ఇప్పించే సేల్స్ పర్సన్‌‌. జార్జ్‌‌ని పాలసీ తీసుకోమని అడిగితే అందుకు ఆయన వద్దంటాడు. దాంతో ఆ సేల్స్‌‌ పర్సన్‌‌ ‘‘దేవుడు మీ ఇంటిని మంటలతో కాల్చేస్తాడు. మీ పిల్లలు నాశనం అవుతారు” అని కోపంగా అరిచి వెళ్లిపోతాడు. వాళ్లిద్దరూ అలా ఎందుకన్నారో జార్జ్‌‌కి అప్పుడు అర్థం కాలేదు. కానీ.. వాళ్లకు ఫైర్‌‌‌‌ యాక్సిడెంట్‌‌ గురించి ముందే ఎలా తెలిసింది? 

గొడవలే కారణమా? 

జార్జ్‌‌తో పాటు ఆ ఏరియాలో ఉన్నవాళ్లంతా ఇటలీ నుంచి వలస వచ్చినవాళ్లే. వాళ్లలో కొందరు ఇటాలియన్ నియంత ముస్సోలినీకి సపోర్ట్‌‌ చేసేవాళ్లు. వాళ్లతో జార్జ్‌‌ ఎప్పుడూ గొడవపడుతుండేవాడు. అతను ఎప్పుడూ ముస్సోలినీని వ్యతిరేకించేవాడు. దానివల్ల వాళ్లే జార్జ్ మీద పగ పెంచుకుని పిల్లల్ని ఎత్తుకెళ్లారా? అనేది కూడా చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది.

ఫోన్‌‌ చేసిందెవరు? 

ఆ ఇల్లు మంటల్లో చిక్కుకుంది ఒంటిగంటకు. అయితే.. సరిగ్గా అరగంట ముందు 12:30 అందరూ నిద్రలో ఉండగా టెలిఫోన్ రింగ్‌‌ అయ్యింది. జెన్నీ నిద్రలేచి ఫోన్‌‌ తీసింది. తెలియని ఒక ఆడ గొంతు వినిపించింది. జెన్నీకి తెలియని ఒక పేరు అడిగింది. రాంగ్‌‌ నెంబర్‌‌‌‌ అని చెప్పగానే ఒక నవ్వు నవ్వింది. దాంతో జెన్నీ ఫోన్‌‌ పెట్టేసింది. తర్వాత లైట్లు ఆర్పేసి, కర్టెన్లు మూసి, తలుపు లాక్ చేసి తన రూంలోకి వెళ్లి పడుకుంది. అప్పుడు ఆమెకు ఇంటి పైకప్పు నుంచి ఏదో శబ్దం వస్తున్నట్టు అనిపించింది. కానీ.. ఏమరపాటులో నిద్రలోకి జారుకుంది. సరిగ్గా గంట సేపటికి అంటే ఒకటిన్నరకు ఆమె రూమ్‌‌ అంతా పొగతో నిండిపోయింది. దాంతో బయటికి పరుగులు తీసింది. అసలు ఆమెకు ఫోన్‌‌ చేసిందెవరు? ఇంటి పై కప్పు నుంచి వచ్చి సౌండ్‌‌ ఏంటి? అనే విషయాలు ఇప్పటికీ మిస్టరీలే. 

అంతా ఒక ప్లాన్‌‌

ఈ విషయాలను ఆధారం చేసుకుని ఆలోచించిన జార్జ్‌‌, జెన్నీ తమ పిల్లలు బతికేఉన్నారని వాళ్లను ఎవరో కిడ్నాప్‌‌ చేశారని నమ్మారు. అందుకే ఇన్వెస్టిగేషన్‌‌ చేయడం మొదలుపెట్టారు. ఒక టెలిఫోన్ రిపేర్ చేసే వ్యక్తి ఆ ఇంట్లో తగలబడిపోయిన వైర్లను చూసి.. టెలిఫోన్‌‌ వైర్లు మంటల్లో కాలిపోవడం వల్ల లైన్‌‌ కట్‌‌ అవ్వలేదు. అంతకుముందే వాటిని ఎవరో కావాలనే కట్‌‌ చేశారని చెప్పాడు. అంటే మంటలు తక్కువగా ఉన్నప్పుడు ఎవరైనా గమనించినా ఫైర్‌‌‌‌ స్టేషన్‌‌కు ఫోన్‌‌ చేయడానికి వీల్లేకుండా చేశారు.  మరో విషయం ఏంటంటే.. ఆ ఇంటి దగ్గర్లో కారు ఇంజిన్‌‌లను తొలగించడానికి వాడే ఒక వస్తువును చూసినట్టు ఒకతను చెప్పాడు. కావాలనే బొగ్గు ట్రక్కుల ఇంజిన్లు పనిచేయకుండా చేశారు. ఆ ఇంట్లో సగం కాలిపోయిన కొన్ని వస్తువులను యార్డ్‌‌లో చూస్తున్నప్పుడు జార్జ్‌‌కు ఒక గట్టి రబ్బరు వస్తువు కనిపించింది. అది పైనాపిల్ బాంబు తయారు చేయడానికి ఉపయోగించే వస్తువు. పైనాపిల్‌‌ బాంబును యుద్ధంలో వాడతారు. మరి ఆ వస్తువు ఇంట్లోకి ఎలా వచ్చింది? అనే ప్రశ్నకు జార్జ్‌‌ దగ్గర  సమాధానం లేదు.

పిల్లలు బతికే ఉన్నారా! 

పిల్లల్ని వెతకడానికి జార్జ్‌‌ వాళ్ల ఫొటోలను పేపర్‌‌‌‌లో వేయించాడు. అంతేకాకుండా ఆ ఏరియాలోని గోడలకు అంటించాడు. వాటిని చూసిన ఒకావిడ.. మంటల్లో చనిపోయిన ఆ ఐదుగురు పిల్లల్ని చూశానని జార్జ్‌‌తో చెప్పింది. ఆమె ఆ ఇంటికి 50 మైళ్ల దూరంలో టూరిస్ట్ బూత్​ నడుపుతుంది. అగ్ని ప్రమాదం జరిగిన రోజు ఉదయమే తనకు పిల్లలు కనిపించారని చెప్పిందామె. వాళ్లకు తానే టిఫిన్‌‌ కూడా  పెట్టిందట. వాళ్లు ఫ్లోరిడా లైసెన్స్ ప్లేట్‌‌తో ఉన్న ఒక టూరిస్ట్ కారులో వెళ్లారట. అంతేకాదు చార్లెస్టన్ అనే హోటల్‌‌లో పనిచేసే మరొకావిడ ఫైర్‌‌‌‌ యాక్సిడెంట్‌‌ జరిగిన వారం తర్వాత ఐదుగురిలో నలుగురిని చూశానని చెప్పింది. పిల్లలతో పాటు ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు ఉన్నారంది. వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే.. వాళ్లతో ఉన్న మగవాళ్లు మాట్లాడనివ్వలేదని చెప్పింది. ఈ ఇన్సిడెంట్లు అన్నీ చూసిన తర్వాత జార్జ్, జెన్నీ ఈ కేసు గురించి 1947లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌‌కు ఒక లెటర్‌‌‌‌ రాశారు. దాంతో కేసు రీ ఓపెన్‌‌ అయ్యింది. అప్పట్లో ఫైర్ డిపార్ట్‌‌మెంట్‌‌ చీఫ్ మోరిస్‌‌పై ఒక విమర్శ కూడా వచ్చింది. అతనికి ఆ ఇంటి బూడిదలో ఒక గుండె దొరికితే.. దాన్ని ఒక డైనమైట్ బాక్స్‌‌లో పెట్టి ఆ ఇంటికి దగ్గర్లో పూడ్చి పెట్టినట్టు చాలామంది చెప్పారు. అక్కడ తవ్వి చూస్తే అందులో ఒక మాంసపు ముద్ద దొరికింది. దాన్ని టెస్ట్‌‌ చేస్తే అది బీఫ్ ముక్క అని తేలింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఈ కేసు గురించి కొన్ని లీడ్స్ వస్తూనే ఉన్నాయి. కానీ.. కేసు మాత్రం సాల్వ్‌‌ అవ్వడంలేదు. దాంతో ఇక లాభం లేదని ఫైర్‌‌‌‌ యాక్సిడెంట్‌‌ జరిగిన ప్లేస్‌‌లో రీసెర్చ్‌‌ చేయాలని వాషింగ్టన్ డీసి నుంచి పాథాలజిస్ట్‌‌ ఆస్కార్ బి. హంటర్‌‌ని తీసుకువచ్చాడు జార్జ్‌‌. అక్కడ ఆయన తవ్వకాలు జరిపి అనేక చిన్న చిన్న వస్తువులను వెలికితీశాడు. దెబ్బతిన్న నాణేలు, సగం కాలిపోయిన డిక్షనరీతోపాటు వెన్నెముక ముక్కలు దొరికాయి. వాటిని టెస్ట్‌‌ చేస్తే అవి 16 నుంచి 17 సంవత్సరాల వయసున్న యువకుడివని తేలింది. కానీ.. ఆ ఇంట్లో చనిపోయినవాళ్లలో 14 ఏళ్ల వయసుపైబడినవాళ్లు ఎవరూ లేరు. అంటే ఆ ఎముక ఆ పిల్లలది కాదు. అంతేకాదు ఆ ఎముకలు మంటల్లో కాలలేదు. మరి ఆ పిల్లలు ఏమైనట్టు?! 

పాత పగలే కారణమా? 

జార్జ్ సోడెర్ 1895లో సార్డినియాలోని తులా ప్రాంతంలో జార్జియో సొడ్డు అనే గ్రామంలో పుట్టాడు. ఇది ఇటలీలో భాగంగా ఉంది. 1908లో అంటే 13 ఏళ్ళ వయసులో యునైటెడ్ స్టేట్స్‌‌కు వలస వచ్చాడు. అయితే.. అతను ఇటలీలో ఏం చేసేవాడు? వాళ్ల ఫ్యామిలీ బ్యాక్‌‌గ్రౌండ్‌‌ ఏంటనేది ఎవరికీ చెప్పలేదు. అప్పటికే ఇటలీలో అతనికి కొందరితో గొడవలున్నాయని, వాళ్లలో ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్లి ఇంటికి నిప్పంటించారేమో అనుకున్నారు చాలామంది. కానీ.. జార్జ్‌‌ మాత్రం దాన్ని కొట్టిపారేశాడు. ఒకవేళ గొడవలున్నా చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చి తనపై పగ సాధిస్తారా? 

::: కరుణాకర్​ మానెగాళ్ల