ఉత్సవాలు ముగిసినాయ్.. ఉత్తమాటలే మిగిలినయ్

ఉత్సవాలు ముగిసినాయ్.. ఉత్తమాటలే మిగిలినయ్


‘నెక్లెస్​ రోడ్​కు పీవీ జ్ఞాన మార్గ్​గా పేరు పెడ్తాం. హైదరాబాద్​లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్​ నిర్మిస్తాం. పీవీ పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను టూరిజం స్పాట్లుగా డెవలప్​ చేస్తాం. పీవీతో మంచి సంబంధాలు ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్​ క్లింటన్​, బ్రిటన్​ మాజీ అధ్యక్షులు జాన్​ మేజర్​, కామెరూన్​లను శత జయంతి ఉత్సవా లకు ఆహ్వానిస్తాం. అసెంబ్లీలో పీవీ పొట్రె యిట్​ పెడతాం. పార్లమెంట్​లో కూడా పెట్టాలని కేంద్రాన్ని కోరుతాం. హైదరా బాద్​లో పీవీ నెలకొల్పిన సెంట్రల్​ యూని వర్సిటీకి ఆయన పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. వంగర, వరంగల్​, కరీంనగర్​, హైదరా బాద్​, ఢిల్లీలో పీవీ విగ్రహాలు పెడతాం.’- ఆగస్ట్​ 28న ప్రగతి భవన్​ లో పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ  మీటింగ్​లో సీఎం కేసీఆర్​  చెప్పిన మాటలివి.

వరంగల్​, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలు ముగిశాయి. ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాగోలా వేడుకలను కంప్లీట్​ చేసేసింది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంబరాలు నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. వాటిని  అమలు చేసేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఒకట్రెండు సార్లు ఉత్సవ నిర్వహణ కమిటీతో మీటింగులు పెట్టి హడావుడి చేశారు. దీంతో పీవీ అభిమానులంతా సంతోషపడ్డారు. కానీ సీఎం ఇచ్చిన హామీల్లో ఒకట్రెండు మినహా మిగతా వాటిని పట్టించుకోలేదు. 

పీవీ ఊళ్లలో డెవలప్​ మెంట్ నిల్​

ప్రస్తుత వరంగల్​ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో పీవీ నరసింహరావు పుట్టారు. పెరిగిందంతా వరంగల్​ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర లోనే. అయితే ఈ రెండు గ్రామాలు పీవీ మరణం తరువాత పెద్దగా డెవలప్​ కాలేదు. దీంతో ఆ రెండు గ్రామాలను టూరిజం స్పాట్లుగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. రూ.7కోట్లతో ఆ  గ్రామాల్లో డెవలప్​ మెంట్​ వర్క్స్​ చేపట్టాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు గతేడాది సెప్టెంబర్​ లో రాష్ట్ర టూరిజం మినిస్టర్​ శ్రీనివాస్​ గౌడ్, స్థానిక మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతిరాథోడ్​ తదితరులు లక్నేపల్లి, వంగర గ్రామాలను సందర్శించి.. టూరిజం సర్క్యూట్ చేస్తామంటూ హడావుడి చేశారే తప్ప జరిగిందేమీ లేదు. లక్నేపల్లిలో పీవీ స్మృతివనం, మ్యూజియం ఏర్పాటుకోసం పది ఎకరాల స్థలం భూసేకరణ దశలోనే ఉండిపోయింది.  ఇక చుట్టుపక్కల గ్రామాల నుంచి వంగరకు వెళ్లే రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గ్రామంలో డ్రైనేజీ సిస్టం కూడా సరిగా లేదు.  పీవీ వాడిన వస్తువులతో ఆయన కుమారులు వంగరలో ఇదివరకే మ్యూజియం ఏర్పాటు చేయగా.. దాన్ని డెవలప్​ చేసే ప్రయత్నం  జరగలేదు. 

ఒకట్రెండు మాత్రమే.. 

పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణకోసం  సీఎం కేసీఆర్​ ప్రత్యేకంగా ఒక కమిటీ వేశారు. ఎంపీ కేశవరావును కమిటీ చైర్మన్​ గా నియమించి.. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, కుమార్తె వాణీ దేవీ, మంత్రి కేటీఆర్, అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, అంపశయ్య నవీన్, అప్పటి మంత్రి ఈటల రాజేందర్ లను మెంబర్లుగా నియమించారు.  సీఎం ఆదేశాలు, కమిటీ సిఫార్సుతో హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్డు పేరును పీవీ జ్ఞానమార్గ్​ గా మార్చి, అక్కడ పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  పీవీ రచనలు, ఆయన జీవిత విశేషాలతో  9 పుస్తకాలు పబ్లిష్ చేశారు. ఇవి తప్ప సీఎం ఇచ్చిన మిగతా హామీలన్నీ నెరవేరలేదు.  

తీర్మానాలతోనే సరి

రాష్ట్ర అసెంబ్లీలో,  పార్లమెంట్​లో పీవీ పొట్రెయిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని  కేసీఆర్​ నిర్ణయించారు. గతేడాది సెప్టెంబర్​ 8న అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఈమేరకు  తీర్మానం చేశారు. కానీ అవింకా అమలుకాలేదు. పీవీతో  సంబంధం ఉన్న జిల్లాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు వంగర, వరంగల్​, కరీంనగర్​, హైదరాబాద్​, ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో పీవీ విగ్రహాలు పెట్టాలని, వెంటనే తయారీ కోసం ఆర్డర్​ ఇవ్వాలని ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులను సీఎం ఆదేశించారు. అవి కూడా మాటలకే పరిమితమయ్యాయి. దీంతో హన్మకొండలో ఏకశిలా ఎడ్యుకేషన్​ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్దే పీవీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక వంగరలో దాదాపు 15 ఏండ్ల కిందట పీవీ కుమారులు ఏర్పాటు చేసుకున్న విగ్రహం వద్దే పొలిటికల్​ లీడర్లు, పీవీ అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.

వరంగల్​ పీవీ మార్గ్ ఎక్కడ..?

హన్మకొండలోని కేయూ ఎస్డీఎల్​సీఈ నుంచి ఫాతిమా నగర్​ వరకున్న రోడ్డును పీవీ మార్గ్​ గా మారుస్తామని గ్రేటర్​ వరంగల్​ కౌన్సిల్​ మీటింగుల్లో ఇదివరకే టీఆర్ఎస్​ లీడర్లు తీర్మానించారు. కానీ ఆ ప్రక్రియ ఇంతవరకు ముందుకుసాగలేదు. కేయూలో పీవీ రీసెర్చ్​ సెంటర్​ ఏర్పాటు చేస్తామని ఏడాది కిందటే చెప్పిన సీఎం తాజాగా అదే హామీని ప్రకటించారు.

సంబురమంతా మాటల్లోనే..

పీవీ చనిపోయిన తర్వాత ఆయన గ్రామాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో పీవీ పేరును ప్రపంచవ్యాప్తం చేసేలా కార్యక్రమాలు చేపడతామని కేసీఆర్​ఇచ్చిన హామీలతో పీవీ అభిమానులు సంతోష పడ్డారు. పీవీ పుట్టి, పెరిగిన గ్రామాలు డెవలప్​ అవుతాయని ఆశపడ్డారు. కానీ ఇవేవీ అమలు కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.