గాయంతో ప్రపంచ ఛాంపియన్ షిప్ నుంచి పీవీ సింధు ఔట్

 గాయంతో ప్రపంచ ఛాంపియన్ షిప్ నుంచి పీవీ సింధు ఔట్

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరల్డ్ ఛాంపియన్ షిప్ కు దూరమైంది. గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. చీలమండ గాయంతో బాధపడుతున్న పీవీ సింధు.. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఆడటం లేదని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వర్గాలు కూడా వెల్లడించాయి. కామన్వెల్త్ సింగిల్స్ ఫైనల్లో సింధు గాయపడినట్లు పేర్కొన్నాయి.

త్వరలోనే తిరిగి వస్తా..

కామన్వెల్త్ లో బంగారు పతకం సాధించాలన్న ఉద్దేశంతో..ఫైనల్లో గాయంతోనే ఆడానని.. అయితే దురదృష్టవశాత్తు గాయం ఎక్కువై ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల నుండి వైదొలగాల్సి వచ్చిందని పీవీ సింధు తెలిపారు. క్వార్టర్ ఫైనల్స్‌లో తాను నొప్పితో ఇబ్బంది పడ్డానని, అయితే కోచ్, ఫిజియో, ట్రైనర్‌ సహాయంతో నొప్పి కొద్దిగా తగ్గిందని చెప్పారు.ఫైనల్స్‌ తర్వాత భరించలేని నొప్పి కలిగిందని, అందుకే హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే MRI తీయించుకున్నట్లు తెలిపారు. కాలుపై ఒత్తిడితోనే ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు ధృవీకరించారని వివరించారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారని ట్విట్టర్ లో సింధు వెల్లడించారు. తాను కొన్ని వారాల్లో తిరిగి శిక్షణకు హాజరవుతానని, అభిమానుల మద్దతు, ప్రేమకు ధన్యవాదాలు అంటూ పీవీ సింధు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ప్రపంచ ఛాంపియన్ షిప్ జపాన్ రాజధాని టోక్యోలో ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పీవీ సింధుకు మంచి రికార్డు ఉంది. 2019 సీజన్‌లో స్వర్ణంతోపాటు అంతకుముందు రెండు కాంస్య పతకాలను సాధించారు.