
- విలీనం కానున్న రెండు కంపెనీలు
- అతిపెద్ద మల్టీప్లెక్స్ చెయిన్‌గా పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్
న్యూఢిల్లీ: సినిమా థియేటర్లను నడిపే పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్‌లు విలీనం కానున్నాయి. మెర్జింగ్ డీల్‌కు ఇరు కంపెనీలు ఓకే చెప్పాయి. రెండు కంపెనీల విలీన సంస్థ అతిపెద్ద మల్టీ ప్లెక్స్ చెయిన్‌గా మారనుంది. ఈ విలీన కంపెనీని పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్‌గా పిలవనున్నారు. రెండు కంపెనీలు మార్కెట్‌లో లిస్టయ్యాయి. షేరు స్వాప్ ప్రాసెస్‌లో ఈ డీల్ కుదిరింది. ఈ డీల్ ప్రకారం, ప్రతీ 10 షేర్లున్న ఐనాక్స్ షేరు హోల్డర్‌కు మూడు పీవీఆర్ షేర్లు వస్తాయి. విలీనం తర్వాత పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ స్క్రీన్‌లు 1,500కు పెరుగుతాయి. ఇప్పటికే ఉన్న స్క్రీన్‌ల బ్రాండింగ్‌ను మార్చమని ఇరు కంపెనీలు ప్రకటించాయి. కొత్తగా ఏర్పాటు చేసే స్క్రీన్‌ల పేరు పీవీఆర్ ఐనాక్స్‌గా ఉంటుందని పేర్కొన్నాయి. ‘పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి ఇరు కంపెనీల షేరు హోల్డర్లు, స్టాక్ ఎక్స్చేంజిలు, సెబీ, ఇతర రెగ్యులేటర్ల నుంచి అప్రూవల్స్ రావాల్సి ఉంది’ అని సపరేట్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. విలీనం తర్వాత ఐనాక్స్ ప్రమోటర్లు విలీన కంపెనీలో కో–ప్రమోటర్లుగా మారతారని తెలిపాయి. విలీన సంస్థలో పీవీఆర్ ప్రమోటర్లకు 10.62 శాతం వాటా, ఐనాక్స్ ప్రమోటర్లకు 16.66 శాతం వాటా ఉంటుంది. విలీన కంపెనీ బోర్డులో పీవీఆర్‌కు, ఐనాక్స్‌కు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. బోర్డు మెంబర్ల సంఖ్య 10 కి చేరుకుంటుంది. విలీన కంపెనీకి ఎండీగా పీవీఆర్‌కు చెందిన అజయ్ బిజ్లీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సంజీవ్ కుమార్‌లు నియమితులవుతారు. విలీన కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఐనాక్స్‌కు చెందిన పవన్ కుమార్ జైన్, నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా సిద్ధార్ధ్ జైన్‌లు నియమితులవుతారు. కాగా, ప్రస్తుతం 73 సిటీలలోని 181 ప్రాపర్టీలలో 871 స్క్రీన్‌లను పీవీఆర్ ఆపరేట్ చేస్తోంది. ఐనాక్స్ 72 సిటీలలోని 160 ప్రాపర్టీలలో 675 స్క్రీన్‌లను ఆపరేట్ చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.