- మేడారంలో భక్తుల భద్రతపై పోలీస్ శాఖ నజర్
- టీజీ క్వెస్ట్ డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా
- క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాకింగ్
- 13 వేల మంది పోలీస్ సిబ్బంది సేవలు
ములుగు, వెలుగు: మేడారం మహాజాతరకు పోలీసు శాఖ ఏఐ ఆధారిత హై లెవల్సెక్యూరిటీ కల్పించనుంది. జాతరకు వచ్చే భక్తుల భద్రతను పర్యవేక్షణకు వినియోగించనుంది. క్షేమంగా అమ్మవార్లను దర్శించుకుని తిరిగి వెళ్లేదాకా పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటోంది. ఈసారి పోలీసు శాఖ వినూత్నంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా మేడారానికి వచ్చే భక్తుల భద్రతకు ప్రణాళికను తయారు చేసింది. రాష్ట్ర సర్కారు ఈసారి అత్యంత వైభవంగా జాతరను నిర్వహిస్తూ.. అమ్మవార్ల గద్దెలను ఆధునీకరించింది. కొద్దిరోజుల కింద సీఎం, మంత్రులు పున: ప్రారంభించారు. పోలీసు కమాండ్కంట్రోల్ రూమ్ లో ఏఐ టెక్నాలజీ వ్యవస్థను కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
టీజీ క్వెస్ట్ డ్రోన్లతో నిఘా
ఈసారి మహాజాతరకు రెండు కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేశారు. భక్తుల భద్రతకు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకునేందుకు ములుగు ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ చర్యలు చేపట్టారు. ఇందుకు 'టీజీ -క్వెస్ట్' మోడ్రన్ ఏఐ డ్రోన్ వ్యవస్థను అమలు చేస్తుండగా.. వీటి ద్వారా 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిఘా ఉంటుంది. మేడారం అటవీ ప్రాంతంతో పాటు జంపన్న వాగు, రద్దీ రోడ్లపై డ్రోన్లతో నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తారు. టీజీ క్వెస్ట్ టెక్నాలజీ డ్రోన్లను10 వరకు వాడుతున్నట్టు తెలిసింది. కుటుంబ సభ్యులతో అమ్మవార్లను దర్శించుకునేలా, భక్తులు తప్పిపోకుండా.. కట్టుదిట్టమైన నిఘా పెడతారు.
బెలూన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ
జాతర సందర్భంగా ట్రాఫిక్‌నియంత్రణ, చోరీలు, మిస్సింగ్‌లు జరగకుండా పోలీసు శాఖ పటిష్ఠ చర్యలు తీసుకోనుంది. మేడారంలో హీలియం బెలూన్లకు అమర్చిన పాన్-టిల్ట్- జూమ్ కెమెరాలను వాడనుంది. అత్యంత ఎత్తు నుంచి భక్తుల రద్దీని పర్యవేక్షించడం, తొక్కిసలాటకు చాన్స్ ఉండే ప్రాంతాలను ముందే పసిగట్టి అధికారులను అలర్ట్ చేయడం వంటి సూచనలు కెమెరాల ద్వారా చెక్ చేస్తారు. సుమారు13వేల మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా12 క్రైమ్ టీమ్ పర్యవేక్షిస్తాయి. పాత నేరస్థుల గుర్తింపునకు ఆస్పత్రి ప్రాంగణాలు, పార్కింగ్ స్థలాల వద్ద ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని వాడుతూ అనుమా నిత వ్యక్తులు, వస్తువులను గుర్తించే రియల్- టైమ్ అలర్ట్ సిస్టమ్‌ను కూడా రెడీ చేశారు. 420 సీసీ కెమెరాలతోపాటు హీలియం బెలూన్లు, డ్రోన్‌కెమెరాలతో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసే చర్యల్లో పోలీసు శాఖ నిమగ్నమైంది.
భక్తుల భద్రతకు ప్రాధాన్యం
మేడారం మహాజాతరకు వచ్చి భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. క్రౌడ్కంట్రోల్, ట్రాఫిక్‌నియంత్రణ, భక్తుల మిస్సింగ్, చోరీలు వంటివి తలెత్తకుండా ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. యాక్సిడెంట్ ఫ్రీతో పాటు క్షేమంగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని గమ్యస్థానాలకు చేరుకునేలా భద్రతపై భరోసా కల్పిస్తున్నాం.
- సుధీర్ రాంనాథ్ కేకన్, ములుగు జిల్లా ఎస్పీ
