తెలంగాణలో ప్రతి ఒక్కరికి.. తక్కువ ధరకే క్వాలిటీ ఇంటర్నెట్!

 తెలంగాణలో ప్రతి ఒక్కరికి.. తక్కువ ధరకే క్వాలిటీ ఇంటర్నెట్!
  • ప్రతి పౌరుడికి అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎస్ రామకృష్ణారావు
  •     క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు రంగంలోకి దిగాలని ఆదేశం
  •     సెక్రటేరియెట్​లో 8వ రాష్ట్ర బ్రాడ్‌బ్యాండ్ కమిటీ సమావేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి, చివరి గ్రామం వరకు తక్కువ ధరకే నాణ్యమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎస్​రామకృష్ణారావు తెలిపారు. మంగళవారం సెక్రటేరియెట్​లో జరిగిన 8వ రాష్ట్ర బ్రాడ్‌బ్యాండ్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. 

ఈ సందర్భంగా సీఎస్​ మాట్లాడుతూ.. టెలికాం విస్తరణలో ఎదురవుతున్న క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు, సమన్వయాన్ని పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్లు తక్షణమే రంగంలోకి దిగాలని ఆదేశించారు. రానున్న 15 రోజుల్లోగా అన్ని జిల్లాల్లో ‘జిల్లా స్థాయి టెలికాం కమిటీ’ సమావేశాలను నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ లక్ష్యాలకు తగ్గట్టుగా తెలంగాణను డిజిటల్ రంగంలో అగ్రగామిగా నిలపాలని ఆయన ఆకాంక్షించారు.

‘సీబీయూడీ’ యాప్‌పై అవగాహన

భూగర్భ టెలికాం కేబుళ్లు దెబ్బతినకుండా చూడటంపై సీఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. వివిధ పనుల కోసం తవ్వకాలు జరిపే సమయంలో టెలికాం లైన్లు కట్ అవ్వకుండా ‘కాల్ బిఫోర్ యూ డిగ్’ మొబైల్ అప్లికేషన్‌ను తప్పనిసరిగా వాడాలని సూచించారు. క్షేత్రస్థాయి అధికారుల్లో ఈ యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలని టెలికాం సంస్థలను, సంబంధిత శాఖలను ఆదేశించారు. 

తెలంగాణలో అమలవుతున్న ‘టీ-ఫైబర్’ పైలట్ ప్రాజెక్టు గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానతలో ఒక వినూత్న ప్రయోగమని, దీనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని పేర్కొన్నారు. టెలికాం మౌలిక సదుపాయాల కల్పనలో అనేక కీలక సూచీల్లో తెలంగాణ జాతీయ సగటు కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ‘రైట్ ఆఫ్ వే’ నిబంధనల అమలుపై ఈ సమావేశంలో చర్చించారు. 

టెలికాం కేబుళ్ల ఏర్పాటుకు సంబంధించి అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలను విస్తరించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ సహా వివిధ విభాగాల ఉన్నతాధికారులు, పలు టెలికాం సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.