నిజామాబాద్ జిల్లాలో విషాదం: మంజీరా నదిలో మునిగి బావా బామ్మర్దులు మృతి

నిజామాబాద్ జిల్లాలో విషాదం: మంజీరా నదిలో మునిగి బావా బామ్మర్దులు మృతి

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. మంజీరా నదిలో  ఇద్దరు గల్లంతయ్యారు. గొర్రెలకు నీళ్లు తాగించడానికి వెళ్లిన బావా బామ్మర్దులు.. నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోతంగల్ మండల కేంద్రానికి చెందిన గంగోండ అనే నలభై ఏళ్ల వ్యక్తి.. తన గొర్రెల మందకు నీళ్లు తాగించేందుకు మంజీరా నది వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో గొర్రెలకు నీరు అందిస్తుండగా.. ప్రమాదవశాత్తూ గంగోండ నీటిలో ఉన్న ఊబిలో ఇరుక్కుపోయాడు. ఊబిలోంచి బయటకు రాలేక, ప్రాణాల కోసం అతను కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించాడు అతని బామ్మర్ది చిన్న గంగోండ.

కళ్ల ముందే బావ ప్రాణాలు ప్రమాదంలో పడటంతో.. చిన్న గంగోండ ఏమాత్రం ఆలోచించకుండా అతడిని కాపాడేందుకు నదిలోకి దూకాడు. కానీ విధి ఆ ఇద్దరినీ వదల్లేదు. బావను రక్షించబోయిన చిన్న గంగోండ కూడా అదే ఊబిలో ఇరుక్కుపోయాడు. చూస్తుండగానే ఇద్దరూ నీటిలో మునిగిపోయి.. ఊపిరాడక ప్రాణాలు విడిచారు.

సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఒకరి మృతదేహాన్ని నీటిలోంచి వెలికి తీశారు. మరో మృతదేహం కోసం నదిలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంతో పోతంగల్ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బావా బామ్మర్దుల మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.