ప్రకటనలకే పరిమితమవుతున్న క్వాలిటీ ట్రీట్​మెంట్

ప్రకటనలకే పరిమితమవుతున్న క్వాలిటీ ట్రీట్​మెంట్
  •    ఏజెన్సీ గిరిజనుల తిప్పలు
  •   వెంటాడుతున్న మలేరియా, డెంగీ భయం 

 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:ఏజెన్సీలో వైద్యం మేడి పండు చందంగా మారింది. జిల్లాలోని పీహెచ్​సీల్లో పూర్తి స్థాయిలో డాక్టర్లు లేకపోవడంతో క్వాలిటీ ట్రీట్​మెంట్​ అందడం లేదు. జిల్లాలోని 29పీహెచ్​సీల్లో 65 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా,41 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో 22 మంది కాంట్రాక్ట్​ డాక్టర్లే కావడం గమనార్హం. ఒక్కో పీహెచ్​సీకి ఇద్దరు డాక్టర్లకు గానూ పలు పీహెచ్​సీల్లో ఒక్కరే ఉన్నారు. 

మలేరియా, డెంగీ భయం
గ్రామాల్లో మలేరియా, అర్బన్​ ఏరియాల్లో డెంగీ భయం ప్రజలను వెంటాడుతోంది. వర్షాలు ప్రారంభమైన క్రమంలో దోమలు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రోగాలు వ్యాప్తి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏజెన్సీలో పీహెచ్​సీలే వైద్య సేవల్లో కీలకం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పీహెచ్​సీలను డాక్టర్ల కొరత వెంటాడుతోంది. జిల్లాలో 29 పీహెచ్​సీలుండగా, ప్రతీ ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లుండాలి. వీటిలో 12 పీహెచ్​సీలు 24 గంటలు పని చేసేవి ఉన్నాయి. డాక్టర్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో 24 గంటల పీహెచ్​సీలు అలంకార ప్రాయంగానే మారాయి. ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్​సీల్లో పూర్తి స్థాయిలో డాక్టర్లు లేకపోవడంతో రోగులు ట్రీట్​మెంట్​ కోసం ఆర్ఎంపీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తోంది. స్తున్నారు. వారు కమీషన్ల కోసం ఖమ్మం, కొత్తగూడెం జిల్లాకేంద్రాల్లోని ప్రైవేట్​ హాస్పిటల్స్​కు ట్రీట్​మెంట్​ వారిని పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏదైనా గ్రామంలో హెల్త్​ క్యాంప్​ పెడితే రోగులకు నర్సులే ట్రీట్​మెంట్​ చేసే పరిస్థితి ఉంది. డాక్టర్ సెలవుపై వెళ్తే నర్సులే వైద్యం అందిస్తున్నారు. పీహెచ్​సీలలో బయోమెట్రిక్  సిస్టం అమలులో లేకపోవడంతో వైద్యులు ఇష్టమైనప్పుడు హాస్పిటల్​కు వచ్చిపోతున్నారనే  ఆరోపణలున్నాయి. జిల్లాలో 2020లో 594 మలేరియా, 604 డెంగీ కేసులు, 2021లో 353 మలేరియా, 381 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.  ఈ ఏడాది ఇప్పటి వరకు 108 మలేరియా కేసులు, 26 డెంగీ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులు మొదలు కాకముందే వందకు పైగా మలేరియా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు 26 డెంగీ కేసులు నమోదైతే 20 కేసులు కొత్తగూడెం, ఇల్లందు మున్సిపాలిటీల పరిధిలోనే ఉండడం గమనార్హం. గ్రామాల్లో మలేరియా కేసులు, అర్బన్​ ఏరియాలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు కావడంపై వైద్య శాఖ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 

మెరుగైన ట్రీట్​మెంట్​ అందిస్తాం
పీహెచ్​సీల్లో డాక్టర్ల కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రతీ పీహెచ్​సీకి ఒక డాక్టర్ ఉండేలా చర్యలు తీసుకున్నాం. మలేరియా, డెంగీ నివారణపై ఇప్పటికే డాక్టర్లు, వైద్య సిబ్బందితో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. 279 గ్రామాల్లో మలేరియా నివారణకు చర్యలు చేపడతాం. డెంగీ కేసులు నమోదవుతున్న దృష్ట్యా మున్సిపల్​ ఆఫీసర్లు స్పెషల్​ ఫోకస్​ పెట్టాలి. 
–డాక్టర్​ దయానందస్వామి, డీఎంహెచ్​వో