
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది.. టూరిస్ట్ వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో 8 మంది మృతి చెందారు. మంగళవారం ( జులై 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఉత్తరాఖండ్ లోని పిథోరాగఢ్ మూవాని ప్రాంతంలో జరిగింది ప్రమాదం.పిథోరాగఢ్ లో యాత్రికులను తీసుకుళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.లోయలో పడ్డ మృతదేహాలను వెలికితీసి.. క్షతగాత్రులను రక్షించేందుకు శ్రమిస్తున్నారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
13 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ వాహనం మున్సియారి నుండి బోక్తా గ్రామానికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. భండారి గ్రామ వంతెన సమీపంలో రోడ్డు పక్కన ఉన్న లోయలోకి పడిపోయింది వాహనం. గమ్యస్థానానికి కేవలం 25 అడుగులు దూరంలోనే ప్రమాదం జరిగింది.వాహనంలో ఉన్నవారంతా బొక్తా గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.