
- ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఏపీ..
- కొత్తగా బనకచర్ల కోసం రూ.82 వేల కోట్ల లోన్లకు రెడీ
- ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని కేంద్ర సంస్థలు చెప్తున్నా ఏపీ సర్కారు బేఖాతరు
- ఏపీ పాలిట తెల్ల ఏనుగు అవుతుందంటూ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నా డోంట్‌కేర్
- బనకచర్ల కాంట్రాక్ట్ కోసం ఇప్పటికే రంగంలోకి దిగిన ఓ బడా ఏజెన్సీ
- తనకు కాంట్రాక్ట్ ఇస్తే తెలంగాణ సర్కారును ఒప్పిస్తానని బంపరాఫర్
- రూ.50 వేల కోట్ల పనులకు ఏపీలో సబ్‌కాంట్రాక్టర్ల లిస్టులూ రెడీ!
- తమకు రావాల్సిన కమీషన్లు వచ్చాక
- ప్రాజెక్టు ఫెయిలైతే దాన్ని కృష్ణా నీళ్లతో భర్తీ చేసే కుట్ర
- ఏపీలోనూ తప్పుపడ్తున్న మేధావులు, ఆర్థిక నిపుణులు
- ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో బనకచర్లకు వ్యతిరేకంగా పోరుబాట
హైదరాబాద్, వెలుగు: పోలవరం ఇంకా పూర్తికాకముందే పోలవరం–బనకచర్ల (పీబీ) లింకు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం హడావిడి చేస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల అప్పులపాలైన ఏపీ సర్కారు, బనకచర్ల కోసం మరో రూ. 82వేల కోట్ల అప్పు చేసేందుకు ఎందుకు తెగిస్తోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ ప్రాజెక్టు ‘గోదావరి ట్రిబ్యునల్అవార్డు’కు విరుద్ధమని, అసలు అక్కడ వరద జలాలే లేవని కేంద్ర సంస్థలు చెబుతున్నా.. ఈ ప్రాజెక్ట్ మరో కాళేశ్వరంలా మారి, ఏపీ పాలిట తెల్ల ఏనుగు అవుతుందని అక్కడి ఇరిగేషన్ఎక్స్పర్ట్స్, మేధావులు హెచ్చరిస్తున్నా బాబు సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. దీని వెనుక అసలు కారణం వేరే ఉందనే వాదన వినిపిస్తున్నది. గతంలో తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి లాంటి కీలక ప్రాజెక్టులతో పాటు అటు ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టి లక్షల కోట్లు సంపాదించిన ఓ బడా కాంట్రాక్ట్సంస్థే.. ఇప్పుడు ఈ బనకచర్ల ప్రాజెక్టునూ చేపట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది.
అవసరమైతే తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని సదరు కాంట్రాక్ట్ సంస్థ ఆఫర్ఇచ్చినట్లు అక్కడి అధికార, రాజకీయ, మేధావి వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్తమ్మీద 40,500 ఎకరాల వ్యవసాయ భూములు, 17 వేల ఎకరాల అటవీ భూములు సేకరించి, 18 గ్రామాలను ముంచి, 10 లిఫ్టులు పెట్టి, నెలనెలా కరెంట్‌కు వేల కోట్లు ఖర్చు పెడ్తూ 575 కిలోమీటర్లకు గోదావరి నీళ్లు ఎత్తిపోయడం అసాధ్యమని, ఆ పేరుతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని దోచుకెళ్లడమే ఏపీ పాలకుల అసలు లక్ష్యమని స్పష్టమవుతున్నది.
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవలంబించిన విధానాలనే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఫాలో అవ్వాలని ఏపీ సర్కారు భావిస్తోంది. 10 లిఫ్టులు, 38 కిలోమీటర్ల పొడవైన సొరంగాల ద్వారా 575 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనకచర్ల క్రాస్రెగ్యులేటర్కు గోదావరి నీళ్లను తరలించేలా పీబీ లింక్ప్రాజెక్టును రూ.82 వేల కోట్లతో నిర్మించాలని ఏపీ నిర్ణయించింది. ఇది అంచనా మాత్రమే. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి మొత్తం ఖర్చు రూ.లక్ష కోట్లు దాటనుంది.
ఈ క్రమంలో ఇప్పటికే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నీళ్లను తరలించే సెగ్మెంట్1 పనులకు టెండర్లను పిలిచేందుకు ఏపీ సర్కారు రెడీ అవుతోంది. పనిలో పనిగా సెగ్మెంట్2 పనులను సైతం సమాంతరంగా చేసే అంశంపైనా కసరత్తు చేస్తోంది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పనులు దక్కించుకున్న ఓ బడా కాంట్రాక్ట్సంస్థే బనకచర్ల మెయిన్వర్క్స్చేపట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల్లో నాటి, నేటి ముఖ్యమంత్రులకు కావాల్సిన వ్యక్తిగా రంగంలోకి దిగిన సదరు కాంట్రాక్టర్.. బనకచర్ల ప్రాజెక్టులోని కీలకమైన లిఫ్టులు, టన్నెల్స్ లాంటి పనులను తనకు అప్పగించేలా ఏపీ ప్రభుత్వ పెద్దలతో ఇప్పటికే అవగాహన కుదుర్చుకున్నట్లు సమాచారం.
ఇందుకు ప్రతిగా బనకచర్లకు అడ్డుతగులుతున్న తెలంగాణ పెద్దలను ఒప్పిస్తాననే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. అలాగే మిగిలిన పనులను కాళేశ్వరం ప్రాజెక్టులో మాదిరి కావాల్సిన వాళ్లకు నామి నేషన్‌పై ఇచ్చుకోవచ్చనే సలహా కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయా పనులకు సైతం ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ల లిస్టు సిద్ధం చేసి పెట్టుకున్నదని, దాదాపు రూ.50 వేల కోట్ల పనులను పప్పుబెల్లాల్లాగా పంచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ ఏపీ అధికార, రాజకీయ, మేధావి వర్గాల్లో జరుగుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 56 సబ్‌కాంట్రాక్ట్‌లను ఆనాటి బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిందని కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో ఇప్పటికే తేలింది. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలోనూ అదే రీతిలో సబ్‌కాంట్రాక్టుల దందాకు తెరలేపుతున్నట్టు తెలుస్తోంది.
పీబీ లింక్ సాధ్యాసాధ్యాలపై ఎన్నో సందేహాలు..
పోలవరం బనకచర్ల లింక్ సాధ్యం కాదని ఇటు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, జలవనరుల ఎక్స్‌పర్టులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టుపై గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్ట్‌అథారిటీ, సెంట్రల్వాటర్కమిషన్, నేషనల్‌వాటర్ డెవలప్మెంట్ఏజెన్సీలు తమ అభ్యంతరాలను వెల్లడించాయి. మరోవైపు వరద జలాలు/మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టును చేపడుతున్నామని ఏపీ వాదిస్తోంది. కానీ, అసలు గోదావరిలో మిగులు జలాలే లేవని సీడబ్ల్యూసీతో పాటు ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖకూ చెప్పాయి. ఇటు గోదావరి బోర్డు, పీపీఏలు కూడా బనకచర్ల ప్రాజెక్టు అసాధ్యమని కుండబద్దలు కొట్టేశాయి.
అసలు ఏపీ ఏ ప్రాతిపదికన ఆ ప్రాజెక్టును నిర్మిస్తున్నదో క్లారిటీ ఇవ్వట్లేదని గోదావరి బోర్డు తప్పుబట్టింది. ముందు గోదావరిలో వరద/మిగులు జలాల లెక్కలు తేల్చాలని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టును సోర్సుగా వాడుకుంటున్నారు కాబట్టి.. ఈ లింక్ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్ట్వాస్తవ రూపురేఖలు మారిపోతాయని, మళ్లీ డీపీఆర్‌ను, టీఏసీని కొత్తగా సమర్పించాల్సి ఉంటుందని గోదావరి బోర్డు, పీపీఏలు సీడబ్ల్యూసీకి స్పష్టం చేశాయి. ఇటు కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరాం కూడా.. అసలు దేశంలో వరద జలాల కాన్సెప్ట్అన్నదే లేదని, మిగులు జలాలూ ఉండవని తేల్చి చెప్పారు. అలాంటప్పుడు ఏపీ బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడం ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు.
ఇటీవలే ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)పై కేంద్ర పర్యావరణ శాఖ.. టర్మ్స్ఆఫ్రిఫరెన్స్కు ఆమోదం తెలపకుండా దానిని వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. ముందు అంతర్రాష్ట్ర వివాదాలు, మిగులు, వరద జలాల లభ్యతపై స్టడీ చేసి సీడబ్ల్యూసీ అనుమతులు తీసుకోవాలని పీఎఫ్‌ఆర్‌ను పర్యావరణ శాఖ తిప్పి పంపింది. ఇన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ఏపీ మొండిగా వెళ్లడంపై కాంట్రాక్టర్లకు మేలు చేయడం, కమీషన్లు దండుకోవడం తప్ప మరేం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణా నీళ్లకే ఎసరు..
ప్రస్తుతం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగులా మారిపోయింది. లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టుతో వచ్చిన ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా లేకపోవడం.. ఏటా కరెంట్బిల్లులు, ప్రాజెక్టు రుణాల అసలు, మిత్తీలకే రూ.15 వేల కోట్ల దాకా ఖర్చు చేయాల్సి వస్తుండడంతో రాష్ట్ర ప్రజలపై గుదిబండలా తయారైంది. భవిష్యత్తులో బనకచర్ల విషయంలోనూ ఇలాగే జరుగుతుందన్న అనుమానాలను అక్కడి నీటిపారుదల రంగ నిపుణుల వ్యక్తం చేస్తున్నారు. రౌండ్టేబుల్సమావేశాలనూ ఏర్పాటు చేసి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. 4 వేల మెగావాట్ల కరెంట్అవసరమైతే.. ఒక్క మెగావాట్‌కే కనీసం ఐదారు కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్టుకు చేసే అప్పులు, వాటికి మిత్తీలు, నెలనెలా కరెంట్బిల్లులు కట్టడం ఏపీకి పెనుభారంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కానీ అక్కడి ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా బనకచర్ల లింక్‌పై మొండిగా ముందుకెళ్తోంది. దీన్ని బట్టి గోదావరి నీళ్లు బనకచర్లకు వచ్చినా రాకున్నా తమ కమీషన్లు తమకు వస్తే చాలని, తర్వాత ప్రాజెక్టు ఫెయిలైతే దాన్ని కృష్ణా నీళ్లతో భర్తీ చేయవచ్చనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోజూ 8 టీఎంసీల కృష్ణా నీళ్లను రాయలసీమకు దోచుకుపోయేలా పోతిరెడ్డిపాడు, తెలుగు గంగ, కేసీ కెనాల్, గాలేరు నగరి, హంద్రీ నీవాలను పటిష్టపరుచుకున్నారు. ఇప్పుడు ఈ పీబీ లింకు సాకుతో ఈ కెపాసిటీని ఇంకా పెంచి, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్‌ను మరింత డెవలప్చేసుకొని కృష్ణా నీళ్లకు శాశ్వతంగా ఎసరుపెట్టబోతున్నారని తెలంగాణ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్అనుమానిస్తున్నారు.
ఏపీలో బనకచర్ల వ్యతిరేక ఉద్యమం..
పోలవరం పూర్తయితే తప్ప నీటి చుక్క కూడా తరలించే పరిస్థితి లేనప్పటికీ చంద్రబాబు మాత్రం బనకచర్ల ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పడంపై ఏపీలో ఇరిగేషన్ నిపుణులు, మేధావులు, ఆర్థికవేత్తల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. ఈ క్రమం లోనే బనకచర్లకు వ్యతిరేకంగా విజయవాడ కేంద్రంగా ఇటీవల ఆలోచనాపరుల వేదిక పురు డుపోసుకుంది. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వేదిక బాధ్యులు మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వర్ రావు, కంభంపాటి పాపా రావు, అక్కినేని భవాని ప్రసాద్, టి.లక్ష్మీ నారా యణ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి న ఏపీపై బనకచర్ల ప్రాజెక్టు మరో గుదిబండలా మారబోతోందని, అందుకే ప్రాజెక్టును అడ్డుకోవా లని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు.
బనకచర్ల ప్రాజెక్టు ను నాటి సీఎంలు కేసీఆర్, జగన్, ఓ బడా కాంట్రా క్టర్ కలిసి మొదలు పెట్టారని.. ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తున్నారని ఇటీవల ఆరోపించారు. ఈ ప్రాజెక్టుతో కేవలం కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజ నం లేదని స్పష్టం చేస్తున్నారు. కాగా, ఆలోచనా పరుల వేదిక సభ్యులు ఆరోపిస్తున్నట్లే ఏపీ ప్రభు త్వం వ్యవహారశైలి ఉంది. వాస్తవానికి బనకచర్ల ప్రాజెక్టును తొలుత ప్రతిపాదించినప్పుడు అంచ నా వ్యయాన్ని కేవలం రూ.80,112 కోట్లుగా ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కానీ, కేంద్రానికి సమర్పిం చిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టులో మాత్రం దానిని రూ.81,900 కోట్లకు పెంచింది. కేవలం రెండు మూడు నెలల వ్యవధిలోనే అంచనాలను రూ.1800 కోట్లదాకా పెంచడం గమనార్హం.
బనకచర్ల ఏపీకి గుదిబండే..
‘గత వైఎస్సార్ సీపీ సర్కార్ చేతగానితనం వల్లే పోలవరం పూర్తి కాలేదు. నేను అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి, నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తా’ అని మాత్రమే గత ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకే ఎన్డీయేలో చేరుతున్నామని కొత్తలో చెప్పారు. ఏపీ ప్రజలు ఇదే నిజమని నమ్మారు. తీరా చూస్తే గతంలో ఎన్నడూ వినని బనకచర్ల ప్రాజెక్టును తెరమీదికి తీసుకొచ్చారు. చంద్రబాబు మనసు ఎందుకు మారిందో అర్థం కావడం లేదు. ఈ బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలపై గుదిబండలా మారబోతోంది.- నేతాజీ, సీపీఎం సెక్రటరీ, ఉమ్మడి గుంటూరు జిల్లా
మేఘా కంపెనీ కోసమే
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి బనకచర్ల ప్రాజె క్టును ప్లాన్ చేశారు. నాటి వైసీపీ, నేటి టీడీపీ ప్రభుత్వానికి అనుసంధానమైన అగర్ బత్తీ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. ఈ కాంట్రాక్ట్సంస్థ కోసమే ప్రాజెక్టు కడ్తు న్నట్లు ఉంది. ఏపీ ప్రజలకు ఈ ప్రాజెక్టు నిజస్వరూపం చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉంది.- ఏబీ వెంకటేశ్వరావు, రిటైర్డ్ డీజీ, ఆలోచనపరుల వేదిక