ఇండియాకు ఫారిన్ రిటైల్ బ్రాండ్ల క్యూ.. ఈ ఏడాది 160 రిటైల్ కంపెనీల స్టోర్లు

ఇండియాకు ఫారిన్ రిటైల్ బ్రాండ్ల క్యూ.. ఈ ఏడాది 160 రిటైల్ కంపెనీల స్టోర్లు

వచ్చే ఐదేండ్లలో 5 వేల స్టోర్లు పెట్టేందుకు రెడీ
    కాఫీ చెయిన్‌‌, రెస్టారెంట్‌‌ చెయిన్లే ఎక్కువ

న్యూఢిల్లీ: గ్లోబల్ రిటైల్ కంపెనీలు ఇండియా బాట పడుతున్నాయి. ఇక్కడి కన్జూమర్లను ఆకర్షించడానికి పెద్ద మొత్తంలో  స్టోర్లు ఓపెన్ చేస్తున్నాయి. యువత గ్లోబల్‌‌ బ్రాండ్లకు ఆకర్షితులు అవుతుండడంతో ఇండియాలో తమ మార్కెట్ పెంచుకోవాలని కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఇండియాలో తమ స్టోర్లు ఓపెన్ చేయడానికి   సుమారు 160 బ్రాండ్లు లోకల్ కంపెనీలతో లేదా సొంతంగా స్టోర్లు పెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఫారిన్ కంపెనీలకు లోకల్‌‌ పార్టనర్లను వెతకడంలో సాయపడే  ఫ్రాంచైజ్‌‌ ఇండియా హోల్డింగ్స్‌‌ తాజాగా ఈ డేటా విడుదల చేసింది. దీని ప్రకారం, ఒక ఏడాదిలో  ఇంత భారీగా ఫారిన్ బ్రాండ్లు ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. ఇవి  వచ్చే ఐదేళ్లలో సుమారు 5 వేల స్టోర్లను ఓపెన్ చేస్తాయని అంచనా. ఏకంగా 250 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇండియాకు రావాలనుకుంటున్న బ్రాండ్లలో  ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టార్‌‌‌‌ కంపెనీలే ఎక్కువగా ఉన్నాయని  ఫ్రాంచైజ్‌‌ ఇండియా హోల్డింగ్స్‌‌ చైర్మన్ గౌరవ్ మౌర్య పేర్కొన్నారు. ముఖ్యంగా కేఫ్‌‌, కాఫీ చెయిన్స్‌‌ ఏర్పాటు చేయడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. సాధారణంగా బర్గర్లు, పిజ్జా  స్టోర్లను ఫారిన్ కంపెనీలు ఎక్కువగా ఓపెన్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాయి. ఫ్రాంచైజ్‌‌ ఇండియా రిపోర్ట్ ప్రకారం, థాయ్‌‌లాండ్‌‌కు చెందిన అతిపెద్ద కాఫీ చెయిన్ కేఫ్‌‌ అమెజాన్‌‌, యూఎస్ కంపెనీ  పీట్స్‌‌ కాఫీ వంటివి ఈ ఏడాది ఇండియాలో తమ స్టోర్లు  ఓపెన్ చేయాలని చూస్తున్నాయి. గ్లోబల్ కంపెనీలు పెద్ద మొత్తంలో కాఫీ స్టోర్లను ఓపెన్ చేయనుండడంతో  స్టార్‌‌‌‌బక్స్‌‌ కూడా తన విస్తరణ ప్లాన్స్‌‌ను వేగవంతం చేసింది.  మూడు రోజులకు ఒక స్టోర్‌‌‌‌ను ఏర్పాటు చేసి, 2028 నాటికి మొత్తం స్టోర్ల సంఖ్యను వెయ్యికి పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది.

యూఎస్ కంపెనీలే ఎక్కువ..

అట్లాంటాకు చెందిన రెస్టారెంట్ చెయిన్ హూటర్స్‌‌   నార్త్‌‌, వెస్ట్‌‌, సౌత్ ఇండియాల్లో 30–50 స్టోర్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. మరో 10 నుంచి 15 స్టోర్లను ఈస్ట్ ఇండియాలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది.  ఇందులో కొన్ని ఒకటి రెండు ఫ్రాంచైజీ మోడల్ స్టోర్లు కూడా ఉంటాయని ఫ్రాంచైజ్‌‌ ఇండియా రిపోర్ట్‌‌ పేర్కొంది. ‘ఇండియా అతి పెద్ద మార్కెట్‌‌.  వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌‌. మా బిజినెస్‌‌కు సరిపోతుంది’ అని హూటర్స్‌‌ చీఫ్ డెవలప్‌‌మెంట్ ఆఫీసర్ మైఖెల్‌‌ యారోస్మిత్‌‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఇండియన్ మార్కెట్ నుంచి వెళ్లిపోయిన ఫారిన్ బ్రాండ్లు కూడా తిరిగి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాయి.  బెయిన్‌‌ బేకరీ,  రెస్టారెంట్‌‌ చెయిన్‌‌ లెపెయిన్‌‌ క్వటిడిన్‌‌, అమెరికన్ ఫాస్ట్‌‌పుడ్ రెస్టారెంట్‌‌ చెయిన్ క్విజ్నోస్‌‌, ఫ్రెంచ్ ఫర్నిచర్ బ్రాండ్ గాటియర్‌‌‌‌, సౌత్ ఆఫ్రికా ఫుడ్ చెయిన్ బార్సెలోస్‌‌ వంటి కంపెనీలు  ఇండియాలో తమ స్టోర్లు పెట్టే అవకాశం ఉంది.  యూఎస్ కమర్షియల్ క్లీనింగ్ సర్వీస్‌‌ కంపెనీ  జానీ కింగ్‌‌, ఫిట్‌‌నెస్‌‌ బొటిక్ బర్న్ బూట్‌‌ క్యాంబ్‌‌, ఫిన్‌‌ల్యాండ్‌‌కు చెందిన సూపర్‌‌‌‌పార్క్‌‌ వంటి  రిటైల్ కంపెనీలు ఇండియాలో తమ బిజినెస్‌‌ను పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. ‘కేవలం పెద్ద బ్రాండ్లు మాత్రమే కాదు చిన్న, మధ్య తరహా ఫారిన్ బ్రాండ్లు కూడా ఇండియన్ మార్కెట్‌‌ ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాయి’ అని  ఫ్రాంచైజ్‌‌ ఇండియా హోల్డింగ్స్‌‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌‌‌‌ వెనూస్‌‌ బరాక్ పేర్కొన్నారు. ఇందులో చాలా బ్రాండ్లు పదేళ్ల కిందటే ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని చూశాయని చెప్పారు. సరైన ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, రెగ్యులేటరీ రూల్స్ వలన ఎంటర్ కాలేకపోయాయని అన్నారు.  యూఎస్ హెల్త్‌‌ జూస్ బ్రాండ్‌‌  జంబా  ఇండియాలో 2013 లోనే ఎంటర్ అవుదామని ప్రయత్నించింది.  లోకల్ పార్టనర్ల కోసం వెతికింది. పదేళ్ల తర్వాత మళ్లీ ఇండియన్ యూత్‌‌ను  ఆకర్షించేందుకు ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఇండియాలో వ్యాపారం చేసే విధానాలు మారాయని బరాక్ అన్నారు. కాగా, దేశంలోని రిటైల్‌‌ సెక్టార్‌‌‌‌లోకి 100 శాతం ఫారిన్‌‌ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌మెంట్లకు వీలుంది.  సింగిల్ బ్రాండ్ రిటైలర్లు, మాన్యుఫాక్చరర్లు ఆటోమెటిక్ రూట్‌‌లో  ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అతిపెద్ద ఫర్నిచర్ మాన్యుఫాక్చరర్‌‌‌‌ ఐకియా ఎఫ్‌‌డీఏ రూట్‌‌లోనే ఇండియాతో తన బిజినెస్ నడుపుతోంది. యాపిల్ కిందటేడాది రెండు స్టోర్లను ఓపెన్ చేసింది.  లోకల్ పార్టనర్లతో కలిసి బిజినెస్ చేయడం మంచిదని ఎనలిస్టులు చెబుతున్నారు. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే కొన్ని ఫారిన్ బ్రాండ్లను ఇండియన్ మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. జిమ్మీ చూ, బర్‌‌‌‌బెర్రీ, మైఖల్ కోర్స్‌‌, ఆర్మాని ఎక్స్చేంజ్‌‌, తాజాగా పర్షియన్ బ్రాండ్ మేజ్‌‌ అండ్ సాండ్రో వంటి బ్రాండ్లను ఇండియాకు తీసుకొచ్చింది. నైన్ వెస్ట్‌‌  ఇప్పటికే బాటా ఇండియాతో చేతులు కలిపింది. ఫుట్‌‌ లాకర్‌‌‌‌  మెట్రో బ్రాండ్‌‌, నైకాతో టై అప్ అయ్యింది.  స్విస్‌‌ లగ్జరీ చాక్లెట్‌‌ బ్రాండ్‌‌ లాడెరక్‌‌  డీఎస్‌‌ గ్రూప్‌‌తో తాజాగా పార్టనర్‌‌‌‌షిప్ కుదుర్చుకుంది. భారీగా ఫారిన్ కంపెనీలు వస్తుండడంతో  మాల్ ఆపరేటర్లు కూడా తమ కమర్షియల్ స్పేస్‌‌ను విస్తరిస్తున్నారు. మాల్స్‌‌లో రిటైల్ స్పేస్  2027 నాటికి 43 శాతం పెరిగి 4 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా.