IND vs SA: ఇండియా అంటే చెలరేగుతాడు: డిసైడర్ మ్యాచ్‌లో సెంచరీతో దుమ్ములేపిన డికాక్

IND vs SA: ఇండియా అంటే చెలరేగుతాడు: డిసైడర్ మ్యాచ్‌లో సెంచరీతో దుమ్ములేపిన డికాక్

ఇండియాతో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ సెంచరీతో మెరిశాడు. శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 80 బంతుల్లో సెంచరీ కొట్టి సఫారీలను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. డికాక్ వన్డే కెరీర్ లో ఇది 23వ సెంచరీ కాగా.. ఇండియాపై ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. డికాక్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 6 సిక్సర్లున్నాయి. ఇండియాపై అద్భుత రికార్డ్ ఉన్న ఈ సఫారీ వికెట్ కీపర్ మరోసారి కీలక మ్యాచ్ లో జట్టుకు అండగా నిలబడ్డాడు. 

తొలి రెండు వన్డేల్లో విఫలమైన డికాక్ నిర్ణయాత్మక మూడో వన్డేలో చెలరేగాడు. ఆరంభంలోనే రికెల్ టన్ వికెట్ కోల్పోవడంతో జాగ్రత్తగా ఆడిన ఈ వికెట్ కీపర్.. ఆ తర్వాత క్రమంగా బ్యాట్ ఝుళిపించాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్ కు కెప్టెన్ బవుమాతో కలిసి 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్.. హాఫ్ సెంచరీ తరువాత దూకుడు పెంచాడు. 30 ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్ లో సిక్సర్ కొట్టి 80 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. 

సెంచరీ తర్వాత ప్రసిద్ కృష్ణ ఒక యార్కర్ తో డికాక్ ను ఔట్ చేసి భారత జట్టుకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఓవరాల్ గా 86 బంతుల్లో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం సౌతాఫ్రికా 36 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. డికాక్ (106) సెంచరీతో అదరగొడితే.. బవుమా 48 పరుగులు చేసి రాణించాడు. ఇండియా బౌలర్లలో ప్రసిద్ కృష్ణ మూడు.. జడేజా, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు.