
జీడిమెట్ల, వెలుగు: ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేయించారు. సర్వే నంబర్ 307లో కొందరు భూకబ్జాదారులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను చేస్తున్నారు. ఇందులోనే స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన స్థలాన్ని సైతం కబ్జా చేశారు. గాజులరామారం, దేవేందర్‌నగర్, పోచమ్మ బస్తీలో 15 గదులు నిర్మించారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీస్‌బందోబస్తు మధ్య వాటిని కూల్చివేయించారు. సర్వే నంబర్ 307లో కబ్జాకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకొని బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్చేస్తున్నారు.