
చెన్నై: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ చిరస్మరణీయ గెలుపును సాధించిన సంగతి తెలిసిందే. కుర్రాళ్లతో కూడిన టీమిండియా 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఆసీస్ టూర్‌లో తమను సర్కస్ జంతువుల మాదిరిగా చూశారంటూ సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. తమ మనోబలాన్ని దెబ్బతీయడానికి కంగారూ అభిమానులు, మీడియా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందన్నాడు. సిడ్నీ టెస్ట్‌లో గెలుపుతో ఫ్యాన్స్ నుంచి తమకు మంచి మద్దతు లభించిందన్నాడు. ఆ నమ్మకమే బ్రిస్బేన్‌లో విక్టరీ సాధించడానికి తోడ్పడిందన్నాడు. వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్‌ల బ్యాటింగ్ ప్రతిభ గురించి తనకు ముందే తెలుసని, వారు అద్భుతంగా రాణించారంటూ కొనియాడాడు.