
ముషీరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీని ప్రకటించడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన విద్యార్థుల, ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్. కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 25 వేల టీచర్ పోస్టులతో కలిపి మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ నియామకాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రైవేటు వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతోపాటు బీసీ రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో జాబ్ ల కోసం ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు తెలియజేశామని, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులు అడగకుండానే మెగా డీఎస్సీ ప్రకటించడం అభినందనీయమన్నారు.