ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల పరిస్థితేంది?

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల పరిస్థితేంది?

22 మార్కులు కలపాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో తప్పుగా వచ్చిన 22 ప్రశ్నలకు 22 మార్కులు ఇవ్వాలనే డిమాండ్​తో నిరుద్యోగ అభ్యర్థులు సోమవారం విద్యానగర్ బీసీ భవన్ వద్ద నిరసన చేపట్టారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఎంపీ ఆర్. కృష్ణయ్యను కలిసి కోరారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడారు. ఈమధ్య జరిగిన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఇంత టెక్నాలజీ ఉండి కూడా ఇట్లయితే అభ్యర్థుల పరిస్థితి ఏందని ఆయన ప్రశ్నించారు.

తప్పుడు ప్రశ్నలు ఇచ్చింది మీరే. వాటిని సరిదిద్ది న్యాయం చేయాల్సింది కూడా మీరే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 ప్రశ్నలు తప్పుగా వస్తే అధికార యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని, ఓఎంఆర్ రీవాల్యుయేషన్ చేయాలని, మల్టిపుల్ ఆన్సర్లున్న ప్రశ్నల్ని తొలగించి మార్కులు కలపాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కటాఫ్ మార్కులు 50కి తగ్గించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఏఎస్ఎఫ్ఐ ప్రతినిధి ఉదయ్ కుమార్, జయంతి, నరసింహ గౌడ్, చంటి ముదిరాజ్, తిరుపతి, మల్లేశ్, భాస్కర్ ప్రజాపతి, అశోక్, హేమంత్, మంజూల, రమ, ప్రదీప్, దివ్య, రాజ్ కుమార్, మహేష్, మీనా, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.