గిరిజనులకు విద్య, వైద్యం అందించాలి: ఆర్ కృష్ణయ్య

గిరిజనులకు విద్య, వైద్యం అందించాలి: ఆర్ కృష్ణయ్య

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో చాలా మంది గిరిజనుల జీవన ప్రమాణాలు, మిగతా ప్రజలతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నాయని వైఎస్సార్ సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సంప్రదాయాలను దేశ సంస్కృతిలో విలీనం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. విద్య, వైద్యాన్ని గిరిజనులకు మరింత దగ్గర చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఏకలవ్య స్కూళ్లను పెంచాలని కేంద్రాన్ని కోరారు. చత్తీస్​గఢ్​లో పలు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ మంగళవారం రాజ్య సభలో కేంద్రం తెచ్చిన ఎస్టీ రాజ్యాంగ ఐదవ సవరణ బిల్లుపై చర్చలో వైఎస్సార్ సీపీ తరఫున కృష్ణయ్య మాట్లాడారు.

ALSO READ :కృష్ణా, గోదావరి బేసిన్​లోని అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద

కులాలవారీగా, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచాలన్నారు. ఆరోగ్యం విషయంలో గిరిజనులు సంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నారని, ఆధునిక ఆరోగ్య వసతులు వాళ్లకు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, ఇరిగేషన్, మార్కెటింగ్ తదితర అంశాల్లో గిరిజనులకు సహకారం అందించాలని కోరారు. తేనె, కుంకుడు కాయలు, ఇతర అటవీ ఉత్పత్తులపై గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.