బీసీలకు సగం సీట్లు ఇవ్వాలి : ఆర్. కృష్ణయ్య

బీసీలకు సగం సీట్లు ఇవ్వాలి : ఆర్. కృష్ణయ్య
  • కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ 
  • మాణిక్​ రావ్​ ఠాక్రేకు ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి
  • 13 డిమాండ్లతో వినతిపత్రం అందజేత
  • బీసీ డిక్లరేషన్​లో వీటిని చేర్చాలని సూచన

హైదరాబాద్​, వెలుగు : మండల్​ కమిషన్​ చేసిన 40 సిఫార్సుల్లో కేవలం రెండింటినే అమలు చేస్తున్నారని, 75 ఏండ్లుగా బీసీలు రిజర్వేషన్లలో అన్యాయానికి గురవుతూనే ఉన్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2,600 బీసీ కులాలను గుర్తిస్తే.. అందులో 2,550 కులాల నుంచి ఇప్పటికీ పార్లమెంట్​లో ఒక్కసారి కూడా రిప్రెజెంటేషన్​ దక్కలేదని తెలిపారు. ఆదివారం హైదరాబాద్​లో కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​ రావ్​ ఠాక్రేతో కృష్ణయ్య భేటీ అయ్యారు. 

బీసీలకు రిజర్వేషన్లు, బీసీ బిల్లు తదితర అంశాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ ప్రకటించిన నేపథ్యంలో.. బీసీ డిక్లరేషన్​లో పెట్టాల్సిన అంశాలపై 13 డిమాండ్లతో ఠాక్రేకు వినతిపత్రం సమర్పించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేశారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉంటే వాటి మీద పోరాడేందుకు వీలుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీ బిల్లు పెట్టేలా పోరాడేందుకు చర్యలు తీసుకోవాలని ఠాక్రేను కృష్ణయ్య కోరారు.  

ఇప్పటికే తెలంగాణ, ఏపీలు బిల్లును పాస్​ చేసి సెంట్రల్​ గవర్నమెంట్​ వద్దకు పంపించాయని, వాటిని పెండింగ్​లో పెట్టారన్నారు. బీసీలకు అన్ని విద్యాసంస్థల్లో 27 శాతం వరకు రిజర్వేషన్లను అమలు చేస్తున్నా.. ప్రీ మెట్రిక్​, పోస్ట్​మెట్రిక్​ స్కాలర్​షిప్​లను అందించడం లేదని, కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేసేలా చూడాలని ఆయన కోరారు. బీసీలకు ఏటా రూ.2 లక్షల కోట్ల బడ్జెట్​ను పెట్టేలా చర్యలు తీసుకోవాలని, జాతీయ స్థాయిలో ఐఐటీ, ఐఐఎంలలో చదివే బీసీ విద్యార్థులకు ఫీజు చెల్లించాలని, ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లను కట్టుదిట్టంగా అమలు చేయాలని డిమాండ్​ చేశారు. బీసీ కార్పొరేషన్​ లోన్ల విషయంలో మరింత ఉదారంగా ఉండాలని, వాటి కోసం ఏటా రూ.50 వేల కోట్ల బడ్జెట్​ను కేటాయించాలన్నారు. 

ప్రమోషన్లలో రిజర్వేషన్లు

ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో బీసీలకు రిజర్వేషన్​ సదుపాయాన్ని కల్పించాలని ఆర్​.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. అందుకోసం పార్లమెంట్​లో బిల్లు పెట్టాలన్నారు. 2008లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టినా.. బీసీ రిజర్వేషన్​ బిల్లును వెనక్కు తీసుకున్నారని తెలిపారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను ఇస్తున్నా.. దానికి చట్టబద్ధత లేదని, కాబట్టి దానికి రాజ్యాంగ మేరకు చట్టబద్ధత కల్పించాలన్నారు. 

చట్టబద్ధత లేకపోవడం వల్ల చాలా రాష్ట్రాలు రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాయని,  ఇలా జరగకుండా ఉండాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

బీసీ అట్రాసిటీస్​ యాక్ట్​ తేవాలి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్​ యాక్ట్​ లాగానే.. బీసీలకూ సామాజిక భద్రత కల్పించేలా బీసీ అట్రాసిటీస్​ యాక్ట్​ను తీసుకురావాలని ఆర్​. కృష్ణయ్య కోరారు. ప్రైవేట్​ సెక్టార్​లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్లను కల్పించాలని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ బ్యాంకుల చైర్​పర్సన్​, యూపీఎస్సీ కమిషన్​, రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు, పబ్లిక్​ లిమిటెడ్​ కంపెనీలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీల నియామకాల్లోనూ కచ్చితంగా బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు.

 రిజర్వేషన్లనేవి ఆర్థికాభివృద్ధి కోసం కాదని, సామాజికాభివృద్ధి కోసం ఉద్దేశించినవని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బీసీలకు విధించిన క్రీమీలేయర్​ రూల్​ను ఎత్తేయాలన్నారు. క్రీమీలేయర్​ వల్ల చాలా మంది బీసీలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డిమాండ్లను కాంగ్రెస్​ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.