నెలాఖరులోగా బీసీ బంధు ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య

నెలాఖరులోగా బీసీ బంధు ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: నెలాఖరులోగా సీఎం కేసీఆర్​హామీ ప్రకారం బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని, రూ.లక్ష కోసం అప్లై చేసుకున్న ప్రతిఒక్కరికీ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ లీడర్లు బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అర్హులైన బీసీలందరికీ రూ.లక్ష పథకాన్ని అందించాలని కోరుతూ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, రాజేందర్, వేముల రామకృష్ణ, నందగోపాల్, రాజ్ కుమార్  శుక్రవారం సెక్రటేరియెట్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ను కలిశారు.

అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికి కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వలేదన్నారు. కనీసం ఇప్పుడైనా దరఖాస్తు చేసుకున్న అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరల ప్రకారం మెస్ చార్జీలు, స్కాలర్​షిప్​లు పెంచుతూ జీవో జారీ చేయాలని, కొత్తగా మంజూరైన బీసీ గురుకుల పాఠశాలలకు అన్ని హంగులతో భవనాలు నిర్మించాలని కోరారు. భవనాల కోసం కేంద్ర ప్రభుత్వం 80 శాతం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 20% ఖర్చుపెట్టి ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు.