బీసీలు ఐకమత్యంతో ముందుకు నడిస్తేనే భవిష్యత్తు

 బీసీలు ఐకమత్యంతో ముందుకు నడిస్తేనే భవిష్యత్తు
  • పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

తుర్కయంజాల్, రంగారెడ్డి జిల్లా:  పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు బీసీలు ఐక్యమత్యంతో ముందుకు నడవాలని.. ఆ దిశగా పార్లమెంటులో తాను కొట్లాడుతానని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో తుర్కయంజాల్లోని ఓ గార్డెన్ లో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రపంచ నాగరికతకు వెదురు పునాదిలాంటిదని.. నాగరికతకు పునాది వేసింది మేదరులేనని అన్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం పెరిగిన తర్వాత వెదురు వృత్తి దెబ్బతిన్నదన్నారు. పుట్టినప్పటి నుండి కాటికి పోయే వరకు వెదురు లేనిది, మేదరులు లేనిది జీవనం ముందుకు సాగడం కష్టం అన్నారు. గతంలో వెదురుతో మేదరులంతా జీవనం కొనసాగించే వారన్నారు. తట్ట, బుట్ట, గంప, చాట.. ఇలా మనిషి జీవన విధానంలో ప్రధమ భూమిక మేదరులదేనన్నారు.

అయితే ఇప్పుడు పుట్టినప్పటి నుండి పుట్టెడు కష్టాలతో మేదరి కులం ఉందన్నారు. సమాజానికి ఉపయోగపడే కులవృత్తులు చేస్తున్న కులాలకు ప్రభుత్వాలు ఏమిచ్చాయని ప్రశ్నించారు. ప్రభుత్వాలను  ప్రశ్నించినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రతి కులాభివృద్ధిలో చదువు కీలకం అని.. చదువు ద్వారానే అధికారం చేతికొస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు వేల హాస్టళ్లు ఉన్నాయని.. గురుకులాల కోసం కొట్లాడితే 1200 గురుకురాలు మంజూరయ్యాయని కృష్ణయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి మనకు రావాల్సిన వాటా మనకు తెస్తామన్నారు. ఇప్పటి వరకు అన్ని రిజర్వేషన్లు సంపాదించుకున్నామని.. ఇక చట్ట సభల్లో రిజర్వేషన్ దక్కించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ లో రిజర్వేషన్ బిల్లు పెట్టి బీసీలకు 50శాతం రిజర్వేషన్ సంపాదించుకుంటే మన అభివృద్ధికి బాటలు అవుతాయని ఆర్ కృష్ణయ్య వివరించారు.