
షీర్ బాగ్, వెలుగు: రాబోయేది బీసీల రాజ్యమేనని , బీసీనే భవిష్యత్ సీఎంగా ఉంటారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కుల గణన చేపట్టాలంటూ 9 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ ఆరోగ్యం క్షీణించడంతో కాచిగూడలోని ప్రతిమ హాస్పిటల్లో మాజీ ఎంపీ వీహెచ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళభరణం కృష్ణమోహన్ తో కలిసి కృష్ణయ్య నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు.
కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొట్లాడుతుంటే, రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ నాయకులు అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. బీసీలంటే పాలకులకు ఎందుకు అంత చిన్నచూపు అని ప్రశ్నించారు. త్వరలోనే కులగణన ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ , నాయకులు జయంతి, నరేందర్, నీల వెంకటేశ్, మేకపోతుల నరేందర్, మల్లేశ్, నందగోపాల్, వేముల రామకృష్ణ , కుమారస్వామి , రాజు తదితరులు పాల్గొన్నారు.