బీసీలను బిచ్చగాళ్లలా చూస్తున్రు

బీసీలను బిచ్చగాళ్లలా చూస్తున్రు
  • బీసీల లెక్కలు తీయాల్సిందే
  • త్వరలోనే తెలుగు రాష్ట్రాల బంద్​ నిర్వహిస్తామన్న అఖిలపక్ష, బీసీ సంఘాల నేతలు
  • 1931 దాకా లెక్కబెట్టి ఇప్పుడెందుకు తీయరన్న కోదండరాం
  • బీసీలను బిచ్చగాళ్లలా చూస్తున్రు: ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్​, వెలుగు: జనాభా లెక్కల్లో ప్రత్యేకంగా బీసీల లెక్కలు తీయాల్సిందేనని అఖిలపక్షాలు, బీసీ సంఘాల నేతలు డిమాండ్​ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలోనే తెలుగు రాష్ట్రాల బంద్​ను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. బుధవారం హైదరాబాద్​లోని ఓ హోటల్​లో గుజ్జ కృష్ణ అధ్యక్షతన అఖిలపక్షాలు, బీసీ, కుల సంఘాల సమావేశం జరిగింది. ప్రత్యేకంగా బీసీలను లెక్కించబోమంటూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్​ దాఖలు చేయడం బాధాకరమని, బీసీలను లెక్కిస్తే వారికి ఎంతో ఉపయోగమని టీజేఎస్​ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. 1931 వరకు బీసీల లెక్కలు తీశారని, ఇప్పుడు మాత్రం ఎందుకు తీయరని ప్రశ్నించారు. బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాల్లాగా, బిచ్చగాళ్లలాగా చూస్తున్నారంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​. కృష్ణయ్య మండిపడ్డారు. జనాభా లెక్కల్లో బీసీలు ఎందరున్నారో చెప్పేందుకు కేంద్రానికొచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​లో కేటాయించిన నిధులతో ఒక్కో బీసీకి బిస్కెట్లు కూడా రావని విమర్శించారు. దీనిపై దశలవారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. తామూ ఈ దేశ బిడ్డలమేనని, తమకూ హక్కులుంటాయని చెప్పారు. అన్ని రంగాలనూ ప్రైవేట్​పరం చేసి రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. తానుగానీ యువకుడిగా ఉండుంటే గన్నుపట్టుకుని పార్లమెంట్​పై దాడి చేసేవాడినన్నారు. బీసీల రిజర్వేషన్లలో క్రీమీలేయర్​ అనేది ఓ దుర్మార్గమైన వ్యవస్థ అని పీసీసీ సీనియర్​వైస్​ప్రెసిడెంట్​ మల్లు రవి అన్నారు. వెంటనే దాన్ని ఎత్తేయాలని డిమాండ్​ చేశారు. బ్రిటిష్​ వాళ్ల విభజించు, పాలించు అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. బీసీలను లెక్కబెట్టకుంటే తిరుగుబాటు వస్తుందని, రక్తపాతాలు జరుగుతాయని హెచ్చరించారు.