బీసీ కుల గణన కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామన్న ఆర్. కృష్ణయ్య

బీసీ కుల గణన కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామన్న ఆర్. కృష్ణయ్య
  •     వచ్చే నెల 5, 6న పార్లమెంట్ వద్ద భారీ నిరసన ప్రదర్శన 

ముషీరాబాద్, వెలుగు: జనాభా లెక్కల్లో భాగంగా బీసీ కుల గణన చేపట్టాలని దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వాలు మారుతున్న బీసీలు మరింత వెనక్కి నెట్టివేయబడుతున్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు, బీసీ బిల్లు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, బీసీలకు బడ్జెట్ తదితర అంశాలపై ఫిబ్రవరి 5, 6 న ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నామని చెప్పారు.

శనివారం సాయంత్రం విద్యానగర్ బీసీ భవన్ లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ  బీసీ సంఘాల నేతల సమావేశం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ మెంబర్ గా ఎన్నికైన డాక్టర్ మారిష్ ను ఆర్. కృష్ణయ్య సత్కరించి అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. బీసీ ప్రధాని అయినప్పటికీ బీసీలకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ వ్యవహరిస్తుందని ఆరోపించారు.

బీజేపీలో స్వార్థపూరిత నాయకులు ఉన్నారని వారు ఆ పార్టీలో కలుపు మొక్కలుగా తయారయ్యాయని ఆయన మండిపడ్డారు. అగ్రకుల పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. ఈ వైఖరి మార్చుకోకుంటే బీసీల సమస్యలపై పట్ల దేశమంతా తిరిగి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మరోపక్క రాష్ట్రంలోని గత ప్రభుత్వం 34 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లను 18 శాతానికి తగ్గించి తీవ్ర అన్యాయం చేసిందని ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు.

ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు జనార్ధన్ గౌడ్, నీల వెంకటేష్, జిల్లా పల్లి అంజి, రాజేందర్, కోట శ్రీనివాస్, మహేందర్, ఆది మల్లేశం, నందగోపాల్, రాజ్ కుమార్, అడ్వకేట్ శివ, నిఖిల్ పాల్గొన్నారు.