ఇదేనా బీసీలకు చేస్తానన్న న్యాయం : ఆర్‌‌.కృష్ణయ్య

ఇదేనా బీసీలకు చేస్తానన్న న్యాయం : ఆర్‌‌.కృష్ణయ్య
  • 42 శాతం రిజర్వేషన్లని.. 17 శాతానికి కుదిస్తారా?: ఆర్‌‌.కృష్ణయ్య

ట్యాంక్ బండ్, వెలుగు: బీసీలకు రిజర్వేషన్ల ఆశ చూపి ధోకా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇకపై ఉపేక్షించేది లేదని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తానన్న న్యాయం ఇదేనా.. 42 శాతం రిజర్వేషన్లని చెప్పి 17 శాతానికి కుదిరిస్తారా.. అని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేతలు నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి నేతృతంలో గురువారం హైదరాబాద్‌లోని లిబర్టీ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. 

ఈ ర్యాలీలో జాతీయ కోఆర్డినేటర్ ర్యాగ అరుణ్ కుమార్‌‌తో కలిసి ఆర్.కృష్ణయ్య హాజరై, మాట్లాడారు. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆయన ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీ, కేబినెట్‌లో నమ్మించి బీసీల గొంతు కోశారని మండిపడ్డారు. తగ్గించిన బీసీ రిజర్వేషన్లతో రాష్ట్రంలోని 33 మండలాల్లో ఒక బీసీ సర్పంచ్‌ అభ్యర్థి కూడా లేడని ధ్వజమెత్తారు. 

రిజర్వేషన్లపై ఉద్దేశపూర్వకంగానే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని ఆరోపించారు. ఈ అంశంపై కనీసం ప్రధానిని కూడా కలవలేదన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు కొండ దేవయ్య, భూమన్న, రాజ్ కుమార్, మోడీ రాందేవ్, నిఖిల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నారై అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్

ఎన్నారై అసోసియేషన్ అధ్యక్షుడిగా డి.కిరణ్ కుమార్‌‌ను నియమించారు. గురువారం హైదరాబాద్‌లోని విద్యానగర్ బీసీ భవన్‌లో జరిగిన ఎన్నారైల సమావేశంలో ఆర్‌‌.కృష్ణయ్య ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో ఎన్నారైల పాత్ర కీలకంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ ఇంత పెరగడానికి ఎన్నారైలు కీలకమని పేర్కొన్నారు.