హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ సమాచార హక్కు మానవహక్కుల సమితి సభ్యులు గురువారం నందికొండ మున్సిపాలిటీ కమిషనర్ వేణుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సమాచార హక్కు మానవహక్కు ల సమితి రాష్ట్ర కోశాధికారి గొట్టిముక్కల శివశంకరా చారి మాట్లాడుతూ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గత కొంతకాలంగా కోతుల బెడద అధికమైందని, కోతుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మున్సిపాలిటీ లో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని, మూలనపడ్డ చెత్త సేకరణ వాహనాలను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన ఐదు నెలల జీతభత్యాలను త్వరగా అందించాలని కోరారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి కోతుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత అధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు. సమాచార హక్కు మానవ హక్కుల సమితి రాష్ట్ర కోశాధికారి జి. శివశంకరాచారి, దాసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జి బద్రి తదితరులు పాల్గొన్నారు.
