- యాదాద్రి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంతరావు
యాదగిరిగుట్ట, వెలుగు: ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు ఆఫీసర్లను ఆదేశించారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. నామినేషన్ పత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.
హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వ్యక్తుల వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్లను అదేరోజు నోటీసు బోర్డులపై ప్రదర్శించి, జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలనిఆదేశించారు. .
పోటీ చేసే అభ్యర్థుల ప్రకటనలపై నిఘా
యాదాద్రి: ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం పై మీడియా సెంటర్ ద్వారా నిఘా ఉంటుందని యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో మొదటి విడతగా 6 మండలాల్లో 153 గ్రామ సర్పంచులు 1286 వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు.
నామినేషన్ వేసే అభ్యర్థి కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలని వారి ఎన్నికల ఖర్చు మొత్తం ఆ ఖాతా నుంచి జరపాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో మొదటి విడత ఎన్నికల విధుల్లో పాల్గొని ఆర్వోలకు, ఏఆర్వోలకు, సిబ్బందికి శిక్షణ తరగతులు పూర్తయ్యాయని తెలిపారు. వేలం ద్వారా పదువులు దక్కించుకోవాలని చూస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
