ఇస్రో ప్రయోగాలకు పంచాంగానికి లింక్

ఇస్రో ప్రయోగాలకు పంచాంగానికి లింక్

నటుడు ఆర్.మాధవన్ ఇస్రో ప్రయోగాలకు, పంచాంగానికి లింక్ పెట్టారు. ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. సైంటిఫిక్ విషయాలపై అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మీరు మాట్లాడే దానిలో అర్థం ఉందా అంటూ ఓ నెటిజన్, అసలు విషయం తెలుసుకోకుండా ఇలా మాట్లాడే బదులు సైలెంట్ గా ఉండడం మంచిదంటూ మరో నెటిజన్ కామెంట్స్ చేశారు. వరుస కామెంట్స్ తో నెటిజన్లు ఓ రేంజ్ లో దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ట్రోలింగ్ పై మాధవన్ స్పందించాల్సి వచ్చింది. ‘తమిళంలో నేను పంచాంగం గురించి మాట్లాడాను. నేను అజ్ఞానినే’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. 
 

అసలేం జరిగింది ? 

దక్షిణాది భాషల్లోనే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఆర్. మాధవన్ ప్రత్యేక గుర్తింపు పొందారు. నటనతో అలరిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. యాక్టింగ్ చేయడమే కాకుండా.. దర్శకుడి అవతారం కూడా ఎత్తారు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాకెట్రీ : ద నంబి ఎఫెక్ట్’ సినిమా రూపొందింది. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, హీరో సూర్య కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో జూలై 01న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న మాధవన్ మాట్లాడుతూ.. అంగారక గ్రహ కక్ష్యలోకి చేరేందుకు ఇస్రోకు పంచాంగం ఉపయోగపడిందని, పంచాంగం చూసి పెట్టిన ముహూర్త బలం వల్లే భారత మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించి కక్ష్యలోకి వెళ్లిందని కామెంట్స్ చేశారు. గ్రహస్థితులన్నీ పంచాంగాలలో నిక్షిప్తమై ఉంటాయని ఆయన చెప్పడం వివాదాస్పదమైంది.