
హైదరాబాద్, వెలుగు: నల్గొండ లోక్‌సభ సీటు తనకెందుకు ఇవ్వరని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీల్లో గిరిజనులకు ప్రాతినిధ్యం ఇయ్యాలని నేను అడిగినందుకు సీటు ఇవ్వరా? లేదా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రశ్నించి కేంద్ర ప్రభుత్వ సంస్థలను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినందుకా? విద్యార్థి నాయకుడిగా 1976లో తెలంగాణ బంజారా లంబాడా, ఎరుకల తెగలను ఎస్టీలుగా గుర్తింపు చేయించినందుకా? సీనియర్ గిరిజన నేతగా 1978లో దేవరకొండ ఎమ్మెల్యేగా, మంత్రిగా, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యునిగా పనిచేసినందుకా? ఖమ్మం నుంచి ఎంపీ అభ్యర్థిగా 1998లో పోటి చేసినందుకా? తెలంగాణ ఉద్యమంలో ఆస్తులు అమ్ముకొని ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసినందుకా? లేక వచ్చే ఎన్నికల్లో నల్గొండ టికెట్ ఇవ్వాలని అడిగినందుకా? నాకు నల్గొండ టికెట్ ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం కారణాలు చెప్పాలి’’ అని లేఖలో రవీంద్ర నాయక్ పేర్కొన్నారు