
ఆర్జేడి చీఫ్ లాలు ప్రసాద్ భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను తిరిగి ఇంటికి వచ్చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలంగా తేజ్ ప్రతాప్ యాదవ్ తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు.
ఏడాది కింద ఓ ఆర్జేడీ సీనియర్ నేత కూతురిని పెళ్లి చేసుకున్న తేజ్.. పెళ్లైన కొన్నిరోజులకే ఆమె నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అంతేకాకుండా బీహార్ లోని షెహర్ లోక్ సభ నియోజకవర్గానికి గానూ తన అనుచరుడిని కాకుండా వేరే వ్యక్తిని నిర్ణయించడంతో తన తమ్ముడు తేజస్వీ యాదవ్ పై కూడా తేజ్ అసంతృప్తిగా ఉన్నారు.
అయితే ఇవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్నఅనవసర ఆరోపణలని, తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని రబ్రీ అన్నారు. తన కొడుకును బీజేపీ, జేడీయూలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ప్రస్తుతం బీహార్ లో ఏడు దశలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ ఎన్నికలు ముగిసిన తరువాత రబ్రీదేవి తేజ్ ప్రతాప్ ను ఇంటికి తిరిగి వచ్చేయమంటూ బతిమాలారు. జరగాల్సిందేదో జరిగింది…వచ్చేయ్ నాయినా అంటూ వేడుకున్నారు.