డీసీసీ పోస్టు దక్కెదెవరికీ ?.. ఏఐసీసీకి చేరిన పేర్లపై ఉత్కంఠ

డీసీసీ పోస్టు దక్కెదెవరికీ ?.. ఏఐసీసీకి చేరిన పేర్లపై ఉత్కంఠ
  • పోస్టు తమకే దక్కుతుందని ఆశావహుల ధీమా
  • పదవి తీసుకోడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు విముఖత​
  • ఈనెలాఖరు వరకల్లా పోస్టు భర్తీకి చాన్స్​ 

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ డీసీసీ పదవి ఎవరికీ దక్కుతుందోనని కాంగ్రెస్​ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరు లోగా అధిష్టానం పేరును ప్రకటించే అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్ ఢిల్లీలో క్లారిటీ ఇవ్వడంతో, పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.  డీసీసీ పదవి రేసులో ఉన్న 15 మంది ఆశావహులు తమకే అవకాశం వస్తుందన్న ధీమాలో ఉన్నప్పటికీ, చివరి వరకూ అనుమానం వెంటాడుతోంది.

డీసీసీ పదవి కోసం ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు ప్రతిపాదించినా వివిధ కారణాలతో విముఖత చూపినట్టు సమాచారం. గతంలో లోకల్ సిఫారసులు, లాబీయింగ్ ఆధారంగా పోస్టులు ఇచ్చిన సంప్రదాయానికి భిన్నంగా ఈసారి ఏఐసీసీ ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది. నిజామాబాద్​కు కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్​ను నియమించగా, ఆయన జిల్లాస్థాయి నాయకులతో చర్చించి నలుగురు పేర్లను హైకమాండ్‌కు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.  

సామాజిక వర్గాల సమీకరణ డీసీసీని బలోపేతం చేయడం వల్ల పార్టీ పటిష్టంగా ఉంటుందని  హైకమాండ్​ ఆలోచన. కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్‌ అర్షద్‌ను అబ్జర్వర్‌గా నియమించి గ్రౌండ్‌ లెవెల్‌ అభిప్రాయాలను సేకరించే బాధ్యత అప్పగించింది. అయన అక్టోబర్‌ 13 నుంచి 18 వరకు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి, కేడర్‌ అభిప్రాయాలను తెలుసుకున్నారు. డీసీసీ పోస్టుకు దరఖాస్తు చేసిన 15 మంది లీడర్లను కలిశారు.  సామాజిక సమీకరణలు వడబోతల తర్వాత ఆయన మార్కెట్ మాజీ చైర్మన్ నగేశ్​రెడ్డి, డీసీసీ డెలిగేట్ శేఖర్​గౌడ్, జిల్లా లైబ్రరీ కమిటీ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, బాల్కొండకు చెందిన వేణుగోపాల్ యాదవ్ పేర్లను అధిష్టానానికి అందజేశారు. 

ఎమ్మెల్యేల పేర్లు లేవు

కొన్ని జిల్లాల్లో డీసీసీ పదవులు ఎమ్మెల్యేలకు అప్పగించనున్నట్లు టీపీసీసీ చీఫ్‌ మహేశ్​గౌడ్‌ ఇదివరకే స్పష్టం చేసినా, నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్‌ భూపతిరెడ్డి ఈ పదవిపై ఆసక్తి చూపలేదు. గత ఎనిమిదేళ్లుగా డీసీసీ చీఫ్‌గా ఉన్న మానాల మోహన్‌రెడ్డి ప్రస్తుతం స్టేట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఆయనకు ముందు మైనార్టీ వర్గానికి చెందిన తాహెర్, అంతకు ముందు దళిత వర్గానికి చెందిన గడుగు గంగాధర్‌ బాధ్యతలు నిర్వర్తించారు. 

ఈసారి, కేడర్‌తో సమన్వయం చేసుకుంటూ పార్టీ కోసం ఫుల్‌టైమ్‌ పనిచేసే సమర్థులకు బాధ్యత అప్పగించాలని హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లుగా పార్టీతో కంటిన్యూ అవుతున్న నేతల ట్రాక్‌రికార్డును, సామాజిక సమీకరణను పరిగణనలోకి తీసుకుని అబ్జర్వర్ పేర్లు ఎంపిక చేశారు.  పొడిగింపు అవకాశం లేకపోవడంతో, ఈనెలాఖరుకల్లా డీసీసీ చీఫ్‌ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. హైకమాండ్‌ వద్ద ఫైనల్‌ రిపోర్ట్‌ సిద్ధంగా ఉండగా, జిల్లాలోని కాంగ్రెస్‌ వర్గాలు అదృష్టం ఎవరిని వరిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.