లైంగిక దాడికి యత్నం.. ఎదురుతిరిగిందని...వృద్ధురాలిని నరికి చంపాడు

లైంగిక దాడికి యత్నం.. ఎదురుతిరిగిందని...వృద్ధురాలిని నరికి చంపాడు
  • అదే టైంలో ఇంటికి వచ్చిన భర్తనూ హత్య చేశాడు
  • వీడిన మర్డర్​ మిస్టరీ, నిందితుడి అరెస్టు.. 

ఎల్బీ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం కొత్తగూడ గ్రామంలో వృద్ధ దంపతుల హత్య కేసును రాచకొండ పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్  ఎల్బీ నగర్ లోని క్యాంప్  సీపీ ఆఫీసులో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు.

కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శివకుమార్ (25) తాగుడుకు బానిసయ్యాడు. తాగిన మత్తులో జనసంచారం లేని ప్రాంతాల్లో సంచరిస్తూ ఒంటరిగా ఉన్నవారిపై దాడులకు పాల్పడుతున్నాడు. కాగా, కొత్తగూడలోని ఫాంహౌజ్ లో పనిచేస్తున్న వృద్ధ దంపతులు మూగ శాంతమ్మ (65) , ఉషయ్య (70) ఇంటికి శివకుమార్ రాత్రి 8.30 గంటలకు వెళ్లాడు. తాగడానికి నీళ్లు కావాలని అడిగాడు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న శాంతమ్మపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో కొడవలితో ఆమెను నరికి చంపాడు. అప్పుడే ఉషయ్య ఇంటికి వచ్చాడు. ఉషయ్యను కూడా వెంబడించి కత్తితో నరికి చంపి ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఉషయ్యను చంపిన తర్వాత ఆయన ఫోన్ నుంచి ఒక కాల్​ వెళ్లింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. శివకుమార్  తాగిన మత్తులో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేయడానికి వెళ్లే ముందు తాను వాడే సెల్ ఫోన్ ను స్విచ్వాఫ్  చేస్తాడు. వృద్ధులను చంపిన తర్వాత ఉషయ్య ఫోన్  నుంచి తన నంబర్ కు ఫోన్  చేసుకున్నాడు.  ఈ ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. 

వేలిముద్రలతో దొరికిన శివకుమార్

2023 మే నెలలో కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన శైలజా రెడ్డి(42) ని కూడా శివకుమార్  హత్య చేశాడు. ఆ మహిళ హత్య కేసులో పోలీసులకు వేలిముద్రలు తప్ప ఏ ఆధారం దొరకలేదు. దీంతో కేసు పెండింగ్​లో ఉంది. అయితే, వృద్ధ దంపతుల హత్య కేసులో శివకుమార్ వేలిముద్రలు... శైలజా రెడ్డి హత్య కేసులో సేకరించిన వేలిముద్రలతో మ్యాచ్  అయ్యాయి. శైలజా రెడ్డిని కూడా హత్య చేసింది శివకుమారే అని పోలీసులు గుర్తించారు.

ఆ మూడు హత్యలను తానే చేశానని నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. అతనిపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలిస్తామని సీపీ సుధీర్ బాబు తెలిపారు. కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని పేర్కొన్నారు.