SRH vs CSK: చెన్నై జట్టులో ఆ ముగ్గురే కీలకం.. పైచేయి సాధిస్తే విజయం మనదే!

SRH vs CSK: చెన్నై జట్టులో ఆ ముగ్గురే కీలకం.. పైచేయి సాధిస్తే విజయం మనదే!

ఐపీఎల్ 2024లో నేడు(ఏప్రిల్ 5) మరో ఆసక్తికర సమరం జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో.. సన్ రైజర్స్ హైదరాబాద్ తలడనుంది. ఈ మ్యాచ్ సొంతగడ్డపై(రాజీవ్ గాంధీ స్టేడియం, ఉప్పల్) జరగుతుండటం తెలుగు జట్టుకు కలిసొచ్చేదే అయినా.. ఎల్లో సేనను ఏ మేరకు అడ్డుకుంటానేది ఆసక్తికరంగా మారింది. చెన్నై జట్టులో ముగ్గురు ఆటగాళ్లపై పైచేయి సాధిస్తే.. విజయం మనదేనని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ ముగ్గురు ఎవరు..? ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

రచిన్ రవీంద్ర

కివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్ర చెన్నై జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇస్తున్నాడు. ప్రారంభ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై 15 బంతుల్లోనే 37 పరుగులు చేసిన రవీంద్ర.. గుజరాత్ టైటాన్స్‌పై వీరవిహారం చేశాడు. అహ్మదాబాద్ గడ్డపై బౌండరీల వర్షం కురిపిస్తూ 20 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లను బట్టి అతని విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇతగాడిని త్వరగా పెవిలియన్ చేర్చితే సన్ రైజర్స్‌కు మంచి ఆరంభం దక్కినట్లే.

రుతురాజ్ గైక్వాడ్

సైనెడ్‌లా రుతురాజ్ గైక్వాడ్ సైలెంట్ కిల్లర్ అన్నమాట. భారీ స్ట్రైక్ రేట్ ఉండకపోవచ్చేమో.. కానీ, అతను క్రీజులో కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్‌లు రాబట్టగల సమర్థుడు. అదే జరిగితే చివరలో అతన్ని ఆపడం ఎవరితరం కాదు. అలవోకగా బౌండరీలు సాధించగలడు. వీలైనంత త్వరగా రుతురాజ్‌ను ఔట్ చేస్తే చెన్నై ఆత్మ విశ్వాసంపై దెబ్బ కొట్టొచ్చు.

మతీష పతిరాణా

చెన్నై బౌలింగ్ లైనప్‌లో పతిరాణా కీలకం. డెత్ ఓవర్లలో ఇతడు మరింత ప్రమాదకరం. పదునైన యార్కర్లతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను వణికించగలడు. ఇతని బౌలింగ్‌లో పరుగులు రాకపోయిన పర్లేదు కానీ, వికెట్లు పారేసుకోకూడదు అన్నది విశ్లేషకుల మాట. రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, మతీష పతిరాణాలను వ్యూహాత్మకంగా ఎదుర్కొంటే హైదరాబాద్ జట్టును విజయం నుండి ఎవరు దూరం చేయలేరని విశ్లేషకులు చెప్తున్నారు.

SRH vs CSK హెడ్ to హెడ్ రికార్డ్స్

చెన్నై, సన్ రైజర్స్ జట్ల మధ్య రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 4 మ్యాచ్‌లు జరగ్గా.. ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఇక ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకూ మూడేసి మ్యాచ్‌లు ఆడగా.. చెన్నై రెండింటిలో.. సన్ రైజర్స్ ఒక దానిలో విజయం సాధించాయి.