యూరప్​కు రేడియేషన్​ ముప్పు

యూరప్​కు రేడియేషన్​ ముప్పు
  • రష్యా దాడులతో చెర్నోబిల్ న్యూక్లియర్​ ప్లాంట్​కు పవర్​ కట్​
  • ప్రమాదంలో 20 వేల అణు ఇంధన చాంబర్లు
  • వాటిని చల్లబరిచే లైన్లకు నిలిచిపోయిన కరెంట్​ 
  • దాడులను మరింత తీవ్రం చేసిన రష్యా
  • సూమీ, ఖార్కివ్​, జైటోమిర్​లో బాంబింగ్​

రష్యా దాడుల కారణంగా చెర్నోబిల్ న్యూక్లియర్​ ప్లాంట్​కు కరెంట్​లైన్​​దెబ్బతిన్నదని ఉక్రెయిన్ ప్రకటించింది. ప్లాంట్​లో వాడేసిన అణు ఇంధనాన్ని చల్లబరిచేందుకు ఏర్పాటు చేసిన కరెంట్​ లైన్లకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయిందని, దీంతో అది వేడెక్కి రేడియేషన్​ వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. రిలీజయ్యే అణుధార్మికతతో ఉక్రెయిన్​తో పాటు రష్యా, బెలారస్​, యూరప్​ దేశాలు ప్రమాదంలో పడతాయని వెల్లడించింది. పూర్తిగా రష్యా కంట్రోల్​లో ఉన్న చెర్నోబిల్​ ప్లాంట్​ వద్ద పవర్​ లైన్లను రిపేర్​ చేసే అవకాశం కూడా లేదని పేర్కొంది. మరోవైపు దాడులను రష్యా తీవ్రం చేసింది. సూమీ, ఖార్కివ్​, ఝైటోమిర్​లో ఎయిర్​స్ట్రైక్స్​ చేస్తోంది.

కీవ్​: రష్యా దాడులతో మోతెక్కిపోతున్న ఉక్రెయిన్​కు ఇప్పుడు అణు ఆపద పొంచి ఉంది. చెర్నోబిల్​ నుంచి యూరప్​ దేశాలన్నింటికీ రేడియేషన్​ వ్యాపించే ప్రమాదముందని ఉక్రెయిన్​ ప్రభుత్వ అణు సంస్థ ఎనర్జో ఆటమ్​ ఆందోళన వ్యక్తంచేసింది. చెర్నోబిల్​ ప్లాంట్​లో వాడేసిన అణు ఇంధనాన్ని చల్లబరిచేందుకు ఏర్పాటు చేసిన కరెంట్​ లైన్లకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయిందని ప్రకటించింది. కరెంట్​ లేకుంటే చెర్నోబిల్​లోని 20 వేల అణు ఇంధన అసెంబ్లీలను చల్లబరచడం సాధ్యం కాదని, దీంతో రేడియేషన్​ వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. ఆ అణుధార్మికత ఉక్రెయిన్​తో పాటు రష్యా, బెలారస్​, యూరప్​ దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పింది. వెంటిలేషన్​ వ్యవస్థలు పనిచేయకపోవడం వల్ల అక్కడి ఉద్యోగులు ప్రమాదకర స్థాయుల్లో రేడియేషన్​కు గురయ్యే ముప్పుందని ఎనర్జోఆటమ్​ ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తిగా రష్యా అధీనంలో ఉన్న చెర్నోబిల్​ ప్లాంట్​ వద్ద ఆ పవర్​ లైన్లను ఇప్పటికిప్పుడు రిపేర్​ చేసే అవకాశమూ లేదని పేర్కొంది. అయితే, ప్రస్తుతం పవర్​ కట్​తో పెద్దగా ప్రమాదమేమీ లేదని ఐక్యరాజ్య సమితి న్యూక్లియర్​ వాచ్​డాగ్​ ఐఏఈఏ ప్రకటించింది.  

ఏమైతున్నదో తెల్వట్లే
చెర్నోబిల్​ ప్లాంట్​ వద్ద ఏం జరుగుతున్నదో తమకేం తెలియడం లేదని, ప్రస్తుతం ఆ ప్లాంట్​ మొత్తం రష్యా దళాల అధీనంలోనే ఉందని ఉక్రెయిన్​ విద్యుత్​ శాఖ మంత్రి హెర్మన్​ హాలుషెంకో చెప్పారు. జపోరిషియా అణు విద్యుత్​ కేంద్రంలో కూడా ప్రస్తుత పరిస్థితులేంటో తెలియడంలేదన్నారు. అయితే, రష్యా మాత్రం మరో వాదన వినిపిస్తోంది. అణ్వాయుధ బెదిరింపులను నివారించేందుకే చెర్నోబిల్​, జపోరిషియా న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్​లను తమ కంట్రోల్​లోకి తీసుకున్నామని ప్రకటించింది. 
 మరిన్ని కంపెనీలు వెనక్కు వచ్చేసినయ్​
రష్యా నుంచి మరిన్ని సంస్థలు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నాయి. కేఎఫ్​సీ, పిజ్జాహట్​లు తమ ఆపరేషన్లను నిలిపేశాయి. యమ్​ బ్రాండ్స్​ ఐఎన్​సీ పేరుతో కేఎఫ్​సీ, పిజ్జాహట్​ లు అక్కడ పెట్టుబడి పెట్టాయి. అన్ని పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు నెస్లె ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్​లకు వాహనాలను పంపించకుండా హంగరీలోని ఫ్యాక్టరీకి సుజుకీ మోటార్​కార్ప్​ ఆదేశాలిచ్చింది. రష్యాలో డిస్కవరీ ఐఎన్​సీ ప్రసారాలను నిలిపివేసింది. రష్యాలోని మరిన్ని బ్యాంకులతో పాటు బెలారూస్​లోని బ్యాంకులపై ఈయూ ఆర్థిక ఆంక్షలను విధించింది. రష్యా అప్పర్​ హౌస్​కు చెందిన 146 మంది సెనేటర్లు, 14 మంది ఒలిగార్క్​లను ఈయూ ఆంక్షల జాబితాలో చేర్చింది.  

రష్యాపై జెలెన్​ స్కీ మండిపాటు
పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా సామాన్య జనాన్ని రష్యా చంపేస్తోందని ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ భార్య, ఉక్రెయిన్​ ఫస్ట్​ లేడీ ఒలెనా జెలెన్​స్కా మండిపడ్డారు. తాము శాంతినే కోరుకుంటామని, అదే సమయంలో తమ దేశాన్ని కాపాడుకుని తీరుతామని ఆమె స్పష్టం చేశారు. ప్రశాంతమైన తమ దేశాన్ని దాడులతో రష్యా నాశనం చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలనూ రష్యా చంపేయడం బాధ కలిగిస్తోందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్​ను ఇప్పుడు అడ్డుకోకుంటే భూమ్మీద ఎవరికీ భద్రమైన ప్రదేశమంటూ ఉండదని ఆమె హెచ్చరించారు. తాము గెలుస్తామని, తమ దేశంమీద ప్రేమ, ఐకమత్యమే 
గెలిపిస్తుందని ఆమె చెప్పారు.  

చర్చలకు సిద్ధం: రష్యా
ఉక్రెయిన్​ స్వతంత్రతను తాము అంగీకరిస్తున్నామని, తమ లక్ష్యాన్ని చర్చల ద్వారా చేరుకునేందుకు తాము ఇప్పటికీ సిద్ధమేనని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా చెప్పారు. ఉక్రెయిన్​ ప్రభుత్వాన్ని పడగొట్టడం రష్యా లక్ష్యం కాదన్నారు. ఉక్రెయిన్​తో జరిగే తదుపరి చర్చలు ఫలితాలనిస్తాయన్న ఆశాభావం వ్యక్తంచేశారు.  

మేం ఆంక్షలు పెడ్తే తట్టుకోలేరు.. వెస్టర్న్​ దేశాలకు రష్యా వార్నింగ్​
మాస్కో: పాశ్చాత్య దేశాలు ఆంక్షల మీద ఆంక్షలు పెడ్తుండడంపై రష్యా మండిపడింది. తాము ఆంక్షలు పెడితే తట్టుకోలేరని హెచ్చరించింది. ‘‘వెస్టర్న్​ ఆంక్షలకు దీటుగా మేం కూడా ఆలోచించి వేగంగా నిర్ణయం తీసుకుంటాం’’ అని రష్యా విదేశాంగ శాఖకు చెందిన ఆర్థిక సహకార విభాగం డైరెక్టర్​ దిమిత్రీ బిరిషెవిస్కీ హెచ్చరించారు. రష్యా చమురుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ మంగళవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూరప్​ ఏటా వాడే 50 కోట్ల టన్నుల చమురులో రష్యా నుంచే 30 శాతం సరఫరా అవుతుందని, దాంతో పాటు 8 కోట్ల టన్నుల పెట్రోకెమికల్స్​నూ ఎగుమతి చేస్తున్నామని రష్యా తెలిపింది. ఆంక్షల వల్ల ఆ దేశాలకే నష్టమని చెప్పింది.