బిగ్ ఎఫ్‌‌ఎం కొనుగోలు రేసులో రేడియో మిర్చి, ఆరెంజ్

బిగ్ ఎఫ్‌‌ఎం కొనుగోలు రేసులో రేడియో మిర్చి, ఆరెంజ్

న్యూఢిల్లీ: ఎంటర్‌‌టైన్‌‌మెంట్ నెట్‌‌వర్క్ ఇండియా లిమిటెడ్ (ఈఎన్‌‌ఐఎల్)లో భాగమైన ఎఫ్‌‌ఎమ్ రేడియో నెట్‌‌వర్క్ రేడియో మిర్చితో పాటు రేడియో ఆరెంజ్... బిగ్ ఎఫ్‌‌ఎమ్ రేడియో నెట్‌‌వర్క్‌‌ను కొనుగోలు చేసేందుకు రూ. 251 కోట్ల చొప్పున బిడ్​ వేశాయి.  దివాలా ప్రక్రియలో ఉన్న బిగ్​ ఎఫ్​ఎం రేసులో హర్యానాకు చెందిన సఫైర్ ​ఎఫ్ఎం కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  సఫైర్​ కూడా బిగ్ ఎఫ్​ఎం కోసం 251 కోట్ల రూపాయల బిడ్ వేసింది.  రేడియో మిర్చి, ఆరెంజ్ ఎఫ్‌‌ఎమ్  ,  సఫైర్ ఎఫ్‌‌ఎమ్ -- బిడ్ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లిస్తామని ప్రకటించాయి.  తమ బిడ్‌‌ల విలువను మరింత పెంచాలని బిడ్డర్లను లెండర్లు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కంపెనీ ఖాతాల్లో ఉన్న రూ.60 కోట్ల నగదు కూడా లెండర్లకే చేరుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

బిగ్ ఎఫ్‌‌ఎం ఖాతాల్లోని నగదును లెక్కలోకి తీసుకున్న తర్వాత, లెండర్లకు ఇంకా రూ. 578 కోట్లు రావాలి. రిలయన్స్ బ్రాడ్‌‌కాస్ట్ నెట్‌‌వర్క్ లిమిటెడ్ యాజమాన్యంలోని బిగ్​ఎఫ్​ఎంకు 58 స్టేషన్ల నెట్​వర్క్​ ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద రేడియో నెట్‌‌వర్క్.  1,200 పట్టణాలకు,  50 వేలకుపైగా గ్రామాలకు ప్రసారాలను అందిస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు ఆర్​బీఎన్​ఎల్​ను​ దివాలా ప్రక్రియకు పంపించారు. ఎల్​ అండ్​ టీ ఇన్వెస్ట్‌‌మెంట్ మేనేజ్‌‌మెంట్ లిమిటెడ్ తరపున ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ దాఖలు చేసిన దివాలా దరఖాస్తు ప్రకారం, ఆర్​బీఎన్​ఎల్​ రూ. 175 కోట్ల అప్పును చెల్లించడంలో విఫలమైంది. లెండర్లకు మొత్తం రూ. 578 కోట్లు రావాల్సి ఉంది.