
- కెరీర్‌లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫస్ట్ రౌండ్ ఎగ్జిట్
పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్‌లో అతి పెద్ద సంచలనం. మెగా టోర్నీలో రెండు దశాబ్దాలుగా ఆధిపత్యం చూపెడుతూ..రికార్డు స్థాయిలో 14సార్లు చాంపియన్‌గా నిలిచిన క్లే కోర్ట్ కింగ్ రఫెల్ నడాల్ తొలిసారి ఫస్ట్ రౌండ్‌లోనే ఓడిపోయాడు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ మొదటి రౌండ్ మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (రష్యా) 6–3, 7–6 (7/5), 6–3తో వరుస సెట్లలో స్పెయిన్ బుల్ రఫాకు షాకిచ్చాడు. 2022లో రోలాండ్ గారోస్‌లో గెలిచి 22వ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన 37 ఏండ్ల నడాల్ గాయం కారణంగా గతేడాది బరిలోకి దిగలేదు.
ఏడాది ఆటకు దూరంగా ఉండి టాప్100లో ర్యాంక్ కోల్పోయిన నడాల్ ఈసారి అన్‌సీడెడ్‌గా ఫ్రెంచ్ ఓపెన్‌లోకి వచ్చాడు. తన రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇవ్వని రఫా తొలిరౌండ్‌లోనే ఓడి ఆశ్చర్యపరిచాడు. ఈ టోర్నీలో 116 మ్యాచ్‌ల్లో నడాల్‌కు ఇది నాలుగో ఓటమి. జొకోవిచ్, రాబిన్ సోడర్లింగ్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో అతడిని ఓడించిన మూడో ఆటగాడిగా జ్వెరెవ్ నిలిచాడు. భారీ వర్షం కారణంగా పైకప్పు మూసిన స్టేడియంలో జరిగిన పోరులో జ్వెరెవ్ తొలి గేమ్‌లోనే నడాల్ సర్వీస్ బ్రేక్ చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లో మరోసారి సర్వీస్ కోల్పోయి తొలి సెట్ చేజార్చుకున్న రఫా వెంటనే పుంజుకున్నాడు.
రెండో సెట్‌లో తన మార్కు షాట్లతో 4–2తో లీడ్‌లోకి వచ్చాడు. కానీ, పదో గేమ్‌లో బ్రేక్ సాధించిన జ్వెరెవ్ రెండు బ్రేక్ పాయింట్లను కాపాడుకుంటూ టై బ్రేక్‌లో రెండో సెట్ కూడా నెగ్గాడు. మ్యాచ్‌లో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మూడో సెట్‌ను రఫా 2–0తో ఆరంభించాడు. కానీ, ఎలాంటి అవకాశం ఇవ్వని జ్వెరెవ్ వెంటనే స్కోరు సమం చేసి ఏడో గేమ్‌లో రఫా సర్వీస్ బ్రేక్ చేశాడు.
ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ లభించినా ఈ సెట్ కూడా చేజార్చుకున్న నడాల్ నిరాశతో వెనుదిరిగాడు. మరో మ్యాచ్‌లో ఇండియా స్టార్ సుమిత్ నాగల్ 2–6, 0–6, 6–7 (5/7)తో 18వ సీడ్ కారెన్ కచనోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. రెండో సీడ్ సినర్, 9వ సీడ్ సిట్సిపాస్, విమెన్స్ సింగిల్స్‌లో టాప్ సీడ్ ఇగా స్వైటెక్, కోకో గాఫ్, జాబెర్ తొలి రౌండ్ నెగ్గి ముందంజ వేశారు.
ఇదే చివరిదని చెప్పలేను..
ఓటమి తర్వాత భావోద్వేగంతో మాట్లాడిన నడాల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తనకిదే చివరి మ్యాచ్ అని చెప్పలేనని అన్నాడు. ‘నేను ఇక్కడికి రావడం ఇదే చివరిసారా? అంటే చెప్పలేను. మళ్లీ ఇక్కడికి వస్తానో లేదో నాక్కూడా తెలియదు. ఇది నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. కానీ, గాయాల కారణంగా రెండేండ్లుగా చాలా ఇబ్బంది పడుతున్నా. అందుకే ప్యూచర్ గురించి చెప్పడం చాలా కష్టం. రెండు నెలల కిందటి కంటే ఇప్పుడు నా శరీరం బాగుంది. కానీ, మరో రెండు నెలల తర్వాత ఇలానే ఉంటుందని చెప్పలేను. ఇక్కడే జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొంటానని ఆశిస్తున్నా. వచ్చే ఏడాది ఇక్కడ నేను మిమ్మల్ని (ఫ్యాన్స్) మళ్ళీ చూడాలని కోరుకుంటున్నా. కానీ, అది సాధ్యం అవుతుందో లేదో నాకు తెలియదు’ అని పేర్కొన్నాడు.