మళ్లీ తెరపైకి ‘రాఫెల్’ స్కాం

మళ్లీ తెరపైకి ‘రాఫెల్’ స్కాం

న్యూఢిల్లీ: ఐదేళ్ల కిందట కుదిరిన రాఫెల్ ఒప్పందం విషయంలో మరో సంచలన విషయం బయటపడింది. ఫైటర్ జెట్లను తయారుచేసే డసాల్ట్ సంస్థ.. కొనుగోలుకు సంబంధించిన డీల్ కోసం దేశంలోని ఓ దళారికి 1.1 మిలియన్ యూరోలు (సుమారు రూ.9.5 కోట్లు) ముట్టజెప్పినట్లు ఫ్రాన్స్​కు చెందిన ‘మీడియాపార్ట్’ తన రిపోర్టులో వెల్లడించింది. ఫ్రాన్స్ యాంటీ కరప్షన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈ రిపోర్టు తయారు చేసినట్లు తెలిపింది. “ఆ డబ్బును 50 రాఫెల్ మోడల్స్​ను తయారీకి ఇచ్చామని కంపెనీ చెప్పింది. అయితే దీనికి ఎలాంటి ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేకపోయింది” అని పేర్కొంది. సదరు దళారి.. ఇండియాలో గతంలో ఓ డిఫెన్స్ డీల్​లో మనీ ల్యాండరింగ్​కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. ఏజెన్స్ ఫ్రాంకైస్ యాంటీకరప్షన్(ఏఎఫ్ఏ) సంస్థ తొలిసారి డసాల్ట్ ఆడిట్ సమయంలో ఈ అవినీతిని బయటపెట్టిందని తెలిపింది. దళారికి ఇచ్చిన సొమ్మును ‘క్లయింట్లకు బహుమతి’గా డసాల్ట్ తన ఖర్చుల్లో పేర్కొందని చెప్పింది. అయితే ఏఎఫ్ఏ మాత్రం.. ఈ కేసును ప్రాసిక్యూటర్లకు రెఫర్ చేయకూడదని నిర్ణయం తీసుకుందని వెల్లడించింది.

దర్యాప్తు జరపాలి: కాంగ్రెస్

రాఫెల్ డీల్​పై దర్యాప్తు జరపాలని, ఫ్రెంచ్ సంస్థ రిపోర్టుపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఫైటర్ జెట్ల ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఇప్పుడు నిజమని తేలిందని పార్టీ చీఫ్ స్పోక్స్​పర్సన్ రణ్​దీప్ సుర్జేవాలా అన్నారు. ‘‘దళారి సంస్థ అయిన డెఫ్సీస్ సొల్యూషన్స్​కు డసాల్ట్​1.1 మిలియన్ యూరోలు ఇచ్చినట్లు ఏఎఫ్ఏ దర్యాప్తులో తేలింది. మరి దీనిపై దర్యాప్తు అవసరం లేదా? ఎవరికి, ఎంత కమిషన్ చెల్లించారో, ఒక వేళ ఇండియన్ గవర్నమెంట్​లో ఎవరికైనా చెల్లించారా లేదా అనేది తేలొద్దా?” అని నిలదీశారు. ప్రధాని మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరంలేదా అని ప్రశ్నించారు.