రాఫెల్​ డీల్​ సరైందేనన్న సుప్రీం

రాఫెల్​ డీల్​ సరైందేనన్న సుప్రీం
  • మోడీ సర్కారుకు మళ్లీ సుప్రీం క్లీన్​చిట్
  • గత తీర్పుపై రివ్యూ పిటిషన్లు కొట్టివేత
  • డీల్​పై దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదన్న సీజేఐ బెంచ్
  • కొనుగోలు నిర్ణయం, ప్రక్రియ, ఆఫ్​సెట్​ పార్ట్​నర్ అంశాల్లో అవినీతి జరిగిందనడానికి ఆధారాల్లేవు

న్యూఢిల్లీ: రాఫెల్​ యుద్ధవిమానాల కొనుగోళ్లకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించుకుంది. ఈ డీల్​లో అవినీతి, అవకతవకలు జరిగాయనడానికి, అందులో ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవనిమరోసారి స్పష్టం చేసింది. రక్షణ శాఖ, ఫ్రాన్స్​కు చెందిన దసో ఏవియేషన్​ మధ్య కుదిరిన డీల్​ సరైందేనంటూ గత డిసెంబర్​ 14న ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను గురువారం కొట్టేసింది. ఈ వ్యవహారంలో కొత్తగా ఎఫ్​ఐఆర్​ నమోదుచేసి, డీల్​పై దర్యాప్తు చేయాల్సిన అవసరం లేనేలేదని సీజేఐ బెంచ్​ పేర్కొంది. తాజా తీర్పుతో మోడీ సర్కారుకు రెండోసారి క్లీన్​చిట్ లభించినట్లయింది. అనిల్​ అంబానీకి ప్రయోజనం చేకూర్చేలా రక్షణ శాఖను ఓవర్​టేక్​ చేసిమరీ ప్రధాని కార్యాలయం(పీఎంవో) డీల్​లో జోక్యం చేసుకుందంటూ ‘ది హిందూ’ పత్రిక రాసిన కథనాల్ని ఆధారంగా చూపుతూ, పాత తీర్పును సమీక్షించాలంటూ మాజీ మంత్రులు యశ్వంత్​ సిన్హా, అరుణ్​శౌరీ, లాయర్​ ప్రశాంత్​ భూషణ్, వినీత్​ ధండా ఏప్రిల్​లో రివ్యూ పిటిషన్లు వేశారు. వీటిని చీఫ్​ జస్టిస్​ రంజన్​ గొగోయ్, జస్టిస్ ఎస్​కే కౌల్​, జస్టిస్​ కేఎం జోసెఫ్​లతో కూడిన బెంచ్ విచారించి, తీర్పు వెల్లడించింది.

తీర్పులో ఎం చెప్పారంటే..

ముగ్గురు జడ్జిలు ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు కాపీలో ఇలా రాశారు.. ‘‘రాఫెల్​ డీల్​కు సంబంధించి పిటిషనర్లు ప్రధానంగా మూడు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తారు. డీల్​పై నిర్ణయం, డీల్​ జరిగిన ప్రక్రియ, ఆఫ్​సెట్​ పార్ట్​నర్​గా అనిల్​ అంబానీకి చెందిన రిలయన్స్​ ఎయిరోస్పేస్​ టెక్నాలజీని ఎంపిక చేయడంలో అక్రమాలు జరిగాయని వాదించారు. యుద్ధవిమానాల కొనుగోళ్లు దేశరక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ మూడు అంశాల్లో కోర్టు జోక్యం పరిమితంగా ఉంటుంది. పైగా ఈ డీల్​ ప్రపోజల్​ చాలా ఏండ్లుగా పెండింగ్​లో ఉంటూ వచ్చింది.  కేవలం ఆర్టికల్​ 32 కింద దాఖలు చేశారు కాబట్టే  రివ్యూ పిటిషన్​ను విచారణకు స్వీకరించాం. సుమారు 60వేల కోట్ల విలువైన రాఫెల్​డీల్​పై కోర్టుకు కేంద్రం ఇచ్చిన రిపోర్టులో ఒకవేళ తప్పులు ఉండుంటే కచ్చితంగా ఎఫ్​ఐఆర్ నమోదుకు ఆదేశించేవాళ్లం. కానీ అసలు దర్యాప్తే జరగకుండా, పిటిషనర్లందరూ తమకుతామే అప్పీలేట్​ అథారిటీగా ఫీలయిపోయి, కోర్టు కూడా అలానే భావించాలని కోరుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్నది. కొత్తగా వెలుగులోకి వచ్చిన సమాచారం ఆధారంగా, రాఫెల్​ డీల్​లోని ఒక్కో క్లాజును పరిశీలించి, అందరి వాదనలూ విని, టెక్నికల్​ అంశాల ఆధారంగా ఇంతకుముందిచ్చిన తీర్పును రివ్యూ చేయాలనడం ఏమాత్రం కరెక్ట్​కాదని నిర్ణయించాం”అని జడ్జిలు పేర్కొన్నారు.

ఆపిల్​, బత్తాయి ఒక్కటికాదు

యూపీఏ హయాంలోని డీల్​తో పోల్చుకుంటే మోడీ సర్కార్ కుదుర్చుకున్న డీల్​లో ఎయిర్​క్రాఫ్ట్​ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న వాదనను సీజేఐ బెంచ్​ తోసిపుచ్చింది. ‘‘కేంద్రం ఇచ్చిన రిపోర్టు, అందుబాటులో ఉన్న ఇంకొంత సమాచారం ఆధారంగా ఎయిర్​క్రాఫ్ట్​ ధరల విషయంలో నూటికి నూరుశాతం సంతృప్తి చెందాం.  కొంతమంది వ్యక్తుల అనుమానాలను తీర్చడం మా పని కాదు. ఎయిర్​క్రాఫ్ట్​ ధరలకు సంబంధించి సంబంధిత శాఖల్లోని ఇంటర్నల్​ మెకానిజం కావాల్సినన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటుంది. పిటిషనర్లు సమర్పించిన డాక్యుమెంట్లు చూశాక.. ఆపిల్​ పండుతో బత్తాయి పండును పోల్చిచూడమన్నట్లుంది. నిజానికి పాత డీల్​ కంటే కొత్త డీల్​లోనే ఎయిర్​క్రాఫ్ట్​ల ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి. విమానం ఎలాంటి లోడ్​ను మోసుకెళ్లాలి? రేటు ఎంతుండాలి? అనే విషయాల్ని అధికారుల విచక్షణకే వదిలేయాలి. డీల్​పై రక్షణ శాఖకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ వెల్లడించిన అభిప్రాయాలు(డిసెంట్​ నోట్స్​) రిపోర్టులో పొందుపర్చకపోవడం పెద్ద విషయం కాదు’’ అని సీజేఐ బెంచ్​ అభిప్రాయపడింది.

Rafale verdict: Modi government gets clean chit by Supreme Court