కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనతో నాకు సంబంధం లేదు: రఘునందన్

కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనతో నాకు సంబంధం లేదు: రఘునందన్

బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి విషయంలో బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నారని..  దాడి ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని రఘునందన్  సిద్ధిపేట సీపీని కోరారు. దాడి ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. 

దాడికి తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. పోలీసుల విచారణలో వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు.   దుబ్బాకలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు పిలుపునిస్తూ.. రోడ్డుపై దిష్టి బొమ్మను దహనం చేస్తున్నా సిద్ధిపేట పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభాకర్ రెడ్డిపై దాడిని వంద శాతం  ఖండిస్తున్నానని.. ప్రజాస్వామ్యంలో హింసకు, దాడులకు తావులేదని అన్నారు. 

 దాడి ఘటన తర్వాత బీఆర్ఎస్ నేతలు మా కార్యాలయంపై దాడి చేశారని.. తనను ఈ ఘటనలో ఇరికించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రేపటి(అక్టోబర్ 31)  బంద్ కు సిద్దిపేట సీపీ సమాధానం చెప్పాలని... రేపు ఉదయం చూసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఎన్ని కుట్రలు చేసినా దుబ్బాకలో బీజేపీదే విజయమని రఘునందన్ పేర్కొన్నారు.