ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఈడీకి రఘునందన్​రావు ఫిర్యాదు

ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఈడీకి రఘునందన్​రావు ఫిర్యాదు

​​​​​​హైదరాబాద్, వెలుగు: సంచలనంగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. డబ్బు లావాదేవీలతో పాటు నేరాన్ని రుజువు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. అందుకే ఈ విషయంలో ఈడీ జోక్యం చేసుకోవాలని కోరారు. శుక్రవారం బషీర్ బాగ్ లోని ఈడీ ఆఫీసుకు వెళ్లిన ఆయన ఈ కేసు విషయంలో నిజాలను నిగ్గుతేల్చే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. తర్వాత అక్కడే ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి గురించి, సీజ్ చేసిన డబ్బుల గురించి పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో ఎక్కడ స్పష్టత ఇవ్వలేదన్నారు. అందులో పోలీసులు సరైన ఆధారాలను చూపకపోవడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రిమాండ్ చేసేందుకు కోర్టు కూడా తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు చేసిన ఫిర్యాదులో రూ.100 కోట్లు ఇవ్వజూపారని స్పష్టంగా రాశారు. మరి అంత డబ్బు ఇస్తామన్న వారు ఎవరనేది దర్యాప్తు చేయాలని ఈడీకి వివరించాను. నా స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేసుకున్నరు” అని తెలిపారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం బీజేపీ జాతీయ నాయకత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్నారని రఘునందన్​మండిపడ్డారు. కల్పిత కథలతో టీఆర్​ఎస్​ నాయకులు, లోకల్ పోలీసులు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి వ్యవస్థలపై తమకు నమ్మకం లేదని, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలీసులు పని చేస్తున్నారని విమర్శించారు. వారు ఇక్కడి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారని దుయ్యబట్టారు. అందుకే ఈ కేసుపై ఈడీ దృష్టి పెట్టి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఫామ్ హౌస్ లీలలు

ఈ కేసులో పెద్ద మొత్తంలో నగదు సీజ్ చేశారని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేశాయని, మరి పోలీసులు మాత్రం రిమాండ్ రిపోర్టులో డబ్బుల గురుంచి ఎందుకు ప్రస్తావించలేదని రఘునందన్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముగ్గురు వ్యక్తులు 400 కోట్లు ఇవ్వజూపారని తెలిసిందని అందులో పేర్కొన్నారని, ఒకేసారి రూ.2 లక్షల కన్నా ఎక్కువ నగదు తీసుకెళ్లడం మనీలాండరింగ్ కిందకు వస్తుందన్నారు. ఫామ్ హౌస్ లీలలు.. ఫామ్​హౌస్ పైసలు అనే సినిమాకు నిర్మాత, దర్శకుడు సీఎం కేసీఆరే అన్నారు. ఈ సినిమా షూటింగ్ 24 గంటల్లో పూర్తయిందని ఎద్దేవా చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో చెప్పినట్టే...ఈ కేసులో కూడా రూ. 15 కోట్ల విషయంలో పోలీసులు సరైన ఆధారాలు చూపించలేకపోయారన్నారు.