బీఆర్‌‌ఎస్సోళ్లది పబ్బుల సంస్కృతి : రఘునందన్​రావు

బీఆర్‌‌ఎస్సోళ్లది పబ్బుల సంస్కృతి :  రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు : భారతీయ సంస్కృతి, సంప్రదాయాయాలను బీజేపీ కాపాడుతుంటే ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి పబ్బుల పేరుతో పాశ్చాత్య సంస్కృతికి ఆజ్యం పోస్తున్నాడని బీజేపీ దుబ్బాక అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్​రావు విమర్శించారు. మంగళవారం ఆయన మండలంలోని హబ్షీపూర్​ చౌరస్తాలోని అంబేద్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి బైక్​ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జరిగిన కార్నర్​ మీటింగ్​లో మాట్లాడారు.

దుబ్బాక అభివృద్ధి కోసం నిధులు కావాలని, సమస్యలు తీర్చాలని అసెంబ్లీలో నిలదీస్తే ఇది భరించలేని పొలిటికల్​టూరిస్టులు తనను టార్గెట్​ చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. దళిత, బీసీ, మైనార్టీ బంధు, రేషన్​ కార్డు, ఇంటికో కొలువు, డబుల్​ బెడ్రూమ్​, ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఎందుకివ్వడం లేదని అడిగితే మామ, అల్లుళ్లు తిట్టడం మొదలెట్టారని ఆరోపించారు. దుబ్బాకకు రింగ్ రోడ్డు కావాలని రెండేళ్ల కింద అప్లై చేస్తే ఇంతవరకు మంజూరు చేయలేదు కానీ కేపీఆర్​ను గెలిపిస్తే రింగ్​రోడ్డు ఇస్తానని ఆశీర్వాద సభలో సీఎం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

దుబ్బాక పట్టణంలో బీఆర్ఎస్​ నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయని ఈ నెల 30న ప్రజలు కర్రు కాల్చి వాత పెట్డడడం ఖాయమన్నారు. గెలిచిన తర్వాత మంత్రి హరీశ్ మాదిరి తోటపల్లికి పోనని, కేపీఆర్​లాగా తుజాల్​పూర్​కు వెళ్లనని, ఇక్కడే పుట్టానని, ఇక్కడే పెరిగానని, చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఇక్కడే ఉంటానని పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధి కావాలంటే రెండు కళ్లున్న రఘునందన్ రావు కావాల్నా, దుబ్బాకపై సవతి తల్లి ప్రేమ చూపించే హరీశ్​రావు కావాల్నో ప్రజలు తేల్చేకోవాలన్నారు. సకల జనుల సౌభాగ్యం కోసం మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుపై వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు.