విద్యా వలంటీర్లను రెన్యూవల్ చేయాలి : రఘునందన్ రావు 

విద్యా వలంటీర్లను రెన్యూవల్ చేయాలి : రఘునందన్ రావు 

బషీర్ బాగ్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్లను రెన్యూవల్ చేయాలని, మూడు నెలలుగా పెండింగ్​లో ఉన్న వారి జీతాలను చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సోమవారం లక్డీకపూల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ వద్ద  రాష్ట్ర విద్యావలంటీర్లు ధర్నా నిర్వహించారు. ఆ ఆందోళనలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. అధికారులకు వినతి పత్రాన్ని అందజేసేందుకు వెళ్తుండగా పోలీసులు నిరాకరించడంతో .. విద్యావలంటీర్లతో కలిసి గేటు లోపల రఘునందన్ రావు బైఠాయించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది.

దాంతో  పోలీసులు రఘునందన్ రావుతో పాటు టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ను , విద్యావలంటీర్లను బలవంతంగా అరెస్ట్ చేసి నాంపల్లి , అబిడ్స్ పోలీసు స్టేషన్లకు తరలించారు. విద్యాబుద్ధులు చెప్పే విద్యావలంటీర్ల పట్ల మొండిగా వ్యవహరించడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేనని కూడా చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం ఏంటని మండిపడ్డారు.  2019, 2020 విద్య సంవత్సరాల్లో  రాష్ట్రంలో సుమారుగా 12 వేల మంది విద్యావలంటీర్లు ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహించారని తెలిపారు.

కరోనాతో మూడేళ్లుగా విద్యావలంటీర్లను రెన్యూవల్ చేయలేదన్నారు. దాంతో  దాదాపుగా15 మంది విద్యావలంటీర్లు ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.  12 వేల కుటుంబాలు ఉపాధిలేక రోడ్డును పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  మానవతా దృక్ఫదంతో వారిని రెన్యూవల్ చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యావలంటీర్లు వెంకట్, సైదులు,రవి రతన్, కవిత, మల్లయ్య, రమ కృష్ణ, భావన, మల్లేశ్, అశోక్ పాల్గొన్నారు .