కేసీఆర్​పై ఈడీ కేసు: రఘునందన్ రావు

కేసీఆర్​పై ఈడీ కేసు: రఘునందన్ రావు
  • నమోదైనట్లు నాకు సమాచారం వచ్చింది
  • హరీశ్​, వెంకట్రామిరెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ
  • ప్రజలకు అన్యాయం చేసినోళ్లు పాపం తగిలి పోతరు
  • ఎంపీ రఘునందన్​రావు వ్యాఖ్యలు

మెదక్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్​పై ఈడీ కేసు నమోదైనట్టు ఇప్పుడే తనకు హైదరాబాద్​ నుంచి సమాచారం వచ్చిందని బీజేపీ  మెదక్​ ఎంపీ రఘునందన్ రావు​అన్నారు. మాజీ మంత్రి హరీశ్​ రావు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై కూడా చర్యలుంటాయని.. వాళ్లకు ముందుంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్యానించారు. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారి గురువారం మెదక్ వచ్చిన ఆయన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సన్మాన సభలో మాట్లాడారు. ప్రజలకు అన్యాయం చేసేవాళ్లు పాపం తగిలి పోతారనేది  రుజువవుతున్నదని తెలిపారు. ‘‘బీఆర్ఎస్​ మెదక్​ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి లక్ష కోట్లకు అధిపతి. హైదరాబాద్​శివారులో రూ.100 కోట్లకు ఎకరా లెక్కన కొన్నడు.  మొన్నటి ఎంపీ ఎన్నికల్లో రూ.200 కోట్లు ఖర్చు పెట్టిండు. ఓటుకు వెయ్యి, బీరు, బిర్యానీ పంచినా నియోజకవర్గ ఓటర్లు ఆయనను గడ్డిపోచ లెక్కన పక్కన పెట్టిన్రు.  కేవలం డబ్బు ఖర్చుపెడితే ఎన్నికల్లో గెలుస్తారనేది తప్పని ఈ ఎన్నిక నిరూపించింది” అని రఘునందన్​ అన్నారు. ‘‘సిద్దిపేటలో తాను ఉండగా ఎస్కార్ట్​తో తన మీటింగ్​కు ఇంకొకరు వస్తారని హరీశ్​ రావు​ఊహించలేదు. బీజేపీ కార్యకర్తలే నా గెలుపు కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డారు. నేను మాటల మనిషిని కాదు.. చేతల మనిషిని అని నిరూపిస్తా. ఎక్కడో చిన్న ఊరు బొప్పాపూర్​లో జన్మించిన నన్ను మెదక్​ ప్రజలు ఎంపీగా గెలిపించి పార్లమెంట్​కు పంపారు. నా జీవిత కాలం మెదక్  లోక్​సభ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా” అని తెలిపారు. 

‘‘రామాయంపేట మండలం అక్కన్నపేటలో అజంతా, రాయలసీమ ఎక్స్​ ప్రెస్​ రైళ్లు ఆపాలని.. అక్కన్నపేటలో ర్యాక్​ పాయింట్​ ఏర్పాటు చేయాలని.. మెదక్ స్టేషన్​ నుంచి నడిచే రైలు టైమింగ్స్​ మార్పించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. అలాగే మెదక్ –- చేగుంట రూట్‌‌‌‌‌‌‌‌లో  చేగుంట రైల్వే క్రాసింగ్​ వద్ద ఫ్లైఓవర్​ అవసరం ఉంది. త్వరలోనే సౌత్​ సెంట్రల్​ రైల్వే జీఎంను కలిసి ఈ విషయాల గురించి చర్చిస్తా.  మెదక్ స్పోర్ట్స్​ స్టేడియంలో అథ్లెటిక్​ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తా” అని ఆయన హామీ ఇచ్చారు. లోక్​ సభ ఎన్నికల గెలుపు స్ఫూర్తితో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీజేపీ గెలుపుకోసం ఇప్పటి నుంచే ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని పార్టీ నేతలకు సూచించారు.