ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కేసీఆర్ ఏ1

ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కేసీఆర్ ఏ1
  • ఆయనను అరెస్ట్ చేసి విచారించాలి: రఘునందన్ రావు 
  • హరీశ్ రావును ఏ2గా, వెంకట్రామిరెడ్డిని ఏ3గా,కేటీఆర్ ను ఏ4గా చేర్చాలని డిమాండ్ 
  • ఎమ్మెల్యేలువివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి కూడా ట్యాపింగ్ బాధితులే

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ మొదటి నిందితుడు అని, ఆయన్ను ఆరెస్టు చేసి విచారించాలని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సీఎం ఆదేశాలు లేకుండా ఎవ్వరూ ఫోన్ ట్యాపింగ్ చేయలేరని, ఈ కేసులో కేసీఆర్ ను ఎందుకు నిందితుడిగా చేర్చడంలేదో చెప్పాలన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. దుబ్బాక బై ఎలక్షన్ సమయంలో తన ఫోన్ ను ట్యాప్ చేశారని డీజీపీకి కంప్లైట్ ఇచ్చానని, దీనిపై ఆధారాలు అడిగారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పై తాను ఇచ్చిన ఫిర్యాదుపై డీజీపీ విచారణ చేయాలని కోరారు.

ట్యాపింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మొదటి బాధితుడైతే, తాను రెండో బాధితుడినన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కూడా ఫోన్ ట్యాపింగ్​లు జరిగాయన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో ఫోన్ ట్యాపింగ్ బాధితులేనన్నారు. 2016 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ లపై విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, అప్పట్లో రేవంత్ రెడ్డి ఫోన్ ను ట్యాప్ చేసి ఓటుకు నోటు కేసులో ఆయన్ను ముద్దాయిని చేశారని రఘునందన్ రావు గుర్తుచేశారు. అప్పట్లో డీజీపీగా అనురాగ్ శర్మ, సిటీ పోలీస్ కమిషనర్ గా ప్రస్తుత టీఎస్​పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డి, ఎస్ఐబీలో ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ ఉన్నారన్నారు. ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు దాచిపెడుతున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక 2014 జూన్ 2 నుంచి జరిగిన అన్ని ట్యాపింగ్ లపై విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.  

ఓటుకు నోటు కేసును పక్కనపెడుతున్నరు.. 

ఫోన్ ట్యాపింగ్ విచారణలో నిందితులంతా ప్రభాకర్ రావు చెప్తేనే చేశామని అంటున్నారని రఘునందన్ రావు చెప్పారు. ప్రస్తుతం ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న సుమతీరెడ్డికి ప్రభాకర్ రావు కాల్ చేసి.. ఇప్పుడు మీరు ఎవరు చెప్తే చేస్తున్నారో.. అప్పుడు మేమూ అలాగే చేశామన్నారని తెలిపారు. దుబ్బాక ఉపఎన్నిక సమయంలో డీజీపీకి ఫిర్యాదు చేసినప్పుడే తాను అప్పటి కలెక్టర్, ప్రస్తుత మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, హరీశ్ రావు ముద్దాయిలని చెప్పానన్నారు. ‘‘అల్లుడు, కోడలు ఫోన్ లు వినడం ఎంత తప్పో, మీకు అన్నీ తెలిసి కూడా సగమే బయటపెట్టడం కూడా అంతే తప్పు” అని సీఎంను ఉద్దేశించి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 2015 నాటి ఓటుకు నోటు కేసును ఎందుకు పక్కన పెడుతున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 

వివేక్, రాజగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేయాలె.. 

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో రాజగోపాల్ రెడ్డి బంధువుల దగ్గర రూ.3.5 కోట్లు జప్తు చేశామని విచారణలో రాధాకిషన్ రావు చెప్పారని రఘునందన్ రావు తెలిపారు. అయితే, ఫోన్లు ట్యాప్ అయ్యాయని వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి కంప్లైట్ ఇవ్వడం లేదన్నారు. దీనిపై వారిద్దరు కూడా ఫిర్యాదు చేయాలని కోరారు. వెంకట్రామిరెడ్డిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాపాడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసి బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్​ను ముద్దాయిగా చేసిన ఘటనలో.. కారులో రూ.30 కోట్లు ఉన్నాయని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారని గుర్తుచేశారు. ఆ డబ్బులు ఎక్కడున్నాయో ఇప్పటికీ చెప్పలేదని, దీనిపై విచారణ చేయాలని ఈడీకి అప్పట్లోనే ఫిర్యాదు చేశామన్నారు. రాజపుష్ప కంపెనీకి వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో వెంకట్రామిరెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ల విషయంలో కేసీఆర్ ను మొదటి ముద్దాయిగా, హరీశ్ రావును రెండో ముద్దాయిగా, వెంకట్రామిరెడ్డిని మూడు, కేటీఆర్ ను నాల్గో ముద్దాయిగా పెట్టాలని కోరారు.  

హరీశ్ రావు అప్పుడెందుకు స్పందించలే?  

తామే నికార్సయిన హిందువులం అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్తున్నారని.. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలపై ఎందుకు స్పందించలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. పూజారి సత్యనారాయణరావు హత్య జరిగితే కనీసం ఆయన కుటుంబాన్ని పరామర్శిం చలేదన్నారు. భైంసాలో సంక్రాంతి రోజు జరిగిన మతపరమైన ఘర్షణలో ఎంతమందిని అరెస్టు చేశారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఖాసిం రిజ్వీ వారసులు.. అధికారం పోయాక హిందువులా? అని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ లో కేసీఆర్ హిందూగాళ్లు బొందూగాళ్లు అని అన్నప్పుడు హరీశ్ రావు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు.