
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక సీజేగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ చౌహాన్‌ను తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం మే 13నే కేంద్రానికి సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదించడంతో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దానికి అనుగుణంగా కేంద్ర న్యాయ శాఖ జాయింట్ సెక్రటరీ రాజ్ఇంద్ర కాశ్యప్ సీజే నియామక ఉత్తర్వులు విడుదల చేశారు. జస్టిస్ చౌహాన్ ఈ నెల 22న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. రాజ్‌భవన్‌లో జరగనున్న కార్యక్రమంలో గవర్నర్ నర్సింహన్.. సీజేతో ప్రమాణం చేయిస్తారు. రాజస్తాన్ హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన చౌహాన్.. 2005లో అక్కడే న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్నాకట హైకోర్టుకు బదిలీ అయి, అక్కణ్నుంచి ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు ట్రాన్స్ఫర్ అయ్యారు. తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటైన తొలి సీజేగా పనిచేసిన జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ ఏప్రిల్ 2న కలకొత్తా హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. అప్పటి నుంచి జస్టిస్ చౌహాన్ తాత్కాలిక సీజేగా విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రం ఉత్తర్వులతో ఇప్పుడాయన పూర్తిస్థాయి సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు.
హిమాచల్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుబ్రమణియన్…
రాష్ట్ర హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్ వి.రామసుబ్రమణియన్ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజేఐగా నియమితులయ్యారు. మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా చేసిన సుబ్మమణియన్.. 2006లో అక్కడే అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 నుంచి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా చేశారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టులో ఉంటూ ఇప్పుడు హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టుకు సీజే కాబోతున్నారు. గురువారం ఆయనకు హైకోర్టు వీడ్కోలు చెప్పనుంది.