సర్కారు బడుల్లో రాగి జావ.. మెదక్ జిల్లాలోని 1,265 స్కూళ్లల్లో అమలు

సర్కారు బడుల్లో రాగి జావ.. మెదక్ జిల్లాలోని 1,265 స్కూళ్లల్లో అమలు
  • నేడు పోతిరెడ్డిపల్లి జడ్పీ హెచ్​స్కూల్లో ప్రారంభం

సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పౌష్టికాహారంగా రాగి జావ అందించనున్నారు. ఈ విద్యా సంవత్సరం మొదట్లోనే ప్రారంభం కావాల్సి ఉండగా రెండున్నర నెలల తర్వాత సంగారెడ్డి జిల్లాలో అమలు చేయబోతున్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి సర్కారు బడి పిల్లలకు రాగి జావ అందించనున్నారు. 

ఈ నెల 8న సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేశారు. ముందుగా ఈ స్కూల్లో అమలు చేసి తర్వాత అన్ని సర్కారు బడుల్లో రాగి జావ పంపిణీ చేస్తారు. 

సత్యసాయి ట్రస్ట్ సహకారంతో..

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలకు పౌష్టికాహారం లోపం ఉండకుండా రాగి జావ పంపిణీలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారం అందిస్తోంది. 60 శాతం వ్యాయాన్ని ట్రస్ట్ ఖర్చు చేస్తుండగా మిగతా 40 శాతం ఖర్చు ప్రభుత్వం భరిస్తోంది. స్టూడెంట్స్ కు అవసరమైన పోర్టిఫైడ్ రాగి పొడి, బెల్లం పొడిని సత్యసాయి ట్రస్ట్ స్కూళ్లకు సరఫరా చేస్తోంది. 

మిడ్ డే మీల్స్ కొనసాగిస్తున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు రాగిజావ తయారు చేసి పిల్లలకు ఇవ్వనున్నారు. ప్రతి గ్లాసుకు రూ.25 పైసలు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉండగా వారంలో మూడు రోజులు ప్రతి విద్యార్థికి 10 గ్రాముల రాగి పొడి మరో 10 గ్రాముల బెల్లం పొడి ఇవ్వాలన్న నిబంధనలున్నాయి. రాగి జావ ఇవ్వని మిగతా మూడు రోజులు గుడ్లు ఇవ్వాలని ప్రభుత్వం సూచిస్తోంది. 

నేటి నుంచి ప్రారంభం

బడి పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాగి జావ పంపిణీ ఈ నెల 8 నుంచి ప్రారంభిస్తున్నాం. ముందుగా పోతిరెడ్డిపల్లిలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో పథకాన్ని ప్రారంభించి ఆ తర్వాత అన్ని స్కూళ్లల్లో అమలు చేస్తాం. గత వారమే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ మెటీరియల్ సకాలంలో రాకపోవడం వల్ల కాస్త ఆలస్యమైంది. పిల్లల్లో పౌష్టికాహారం లోపించకుండా రాగిజావ పంపిణీ పకడ్బందీగా అమలు చేస్తాం. పిల్లలు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- వెంకటేశ్వర్లు, డీఈవో