భళిరా డింభకా: ఎద్దు బారి నుంచి నానమ్మను కాపాడిన బుడతడు

భళిరా డింభకా: ఎద్దు బారి నుంచి నానమ్మను కాపాడిన బుడతడు

న్యూఢిల్లీ: ఎద్దు బారి నుంచి తన నానమ్మను కాపాడిన ఓ బాలుడ్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. హరియాణాలో జరిగినట్లుగా చెబుతున్న ఈ ఘటనలో పిచ్చి పట్టిన ఓ ఎద్దు వీధిలో నుంచి వస్తున్న వృద్ధురాలిని పొడిచి కింద పడేసింది. ఎద్దు దెబ్బకు కింద పడిన వృద్ధురాలు మళ్లీ లేవలేకపోయింది. దీన్ని చూసిన సదరు ముసలామె మనుమడు ఆమెను కాపాడటానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో అతడ్ని కూడా ఎద్దు పొడిచింది. గాయాలను లెక్క చేయని ఆ బాలుడు తన నానమ్మను తీసుకొని వెళ్తుండగా ఆ ఎద్దు మరోమారు వాళ్లను పొడిచింది. దీంతో వాళ్లు దూరంగా ఎగిరి పడ్డారు. ఈలోగా సమీపంలో ఉన్న వారు ఎద్దును కర్రతో భయపెట్టి వారిని రక్షించారు. ఎద్దు పొడిచినా భయపడకుండా, తన ప్రాణాలను పణంగా పెట్టి నాన్నమ్మను కాపాడిన సదరు బాలుడి ధైర్యసాహసాలను అందరూ ప్రశంసిస్తున్నారు. ఎద్దు దాడిలో బాలుడితో సహా మరో ముగ్గురికి గాయాలయ్యాయని తెలిసింది. సీసీటీవీల్లో రికార్డు అయిన ఈ వీడియో నెట్‌‌లో వైరల్ అవుతోంది.