బాసర ర్యాగింగ్​ ఘటన.. 5గురు విద్యార్థులకు పనిష్మెంట్

బాసర ర్యాగింగ్​ ఘటన.. 5గురు విద్యార్థులకు పనిష్మెంట్
  • ట్రిపుల్ ​ఐటీ చివరి సెమిస్టర్​ పరీక్షలకు అనర్హులుగా ప్రకటన  
  • క్లాసులకు హాజరుకాకుండా 15 రోజుల సస్పెన్షన్​

భైంసా, వెలుగు: నిర్మల్​ జిల్లా బాసర ట్రిపుల్​ఐటీలో ఇటీవల జరిగిన ర్యాగింగ్​ ఘటనకు కారణమైన ఐదుగురు విద్యార్థులపై వీసీ చర్యలు తీసుకున్నారు. 15 రోజుల పాటు తరగతులకు హాజరుకాకుండా సస్పెండ్​ చేయడంతో పాటు  చివరి సెమిస్టర్​పరీక్షలకు అనర్హులుగా ప్రకటిస్తూ వీసీ వెంకటరమణ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల పీయూసీ ఫస్ట్​ ఇయర్​, సెకండ్​ఇయర్​ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే.

దీంతో ఫస్ట్​ఇయర్​ విద్యార్థులు సెకండ్​ఇయర్​ విద్యార్థులపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వర్సిటీ ఆఫీసర్లు క్రమశిక్షణ కమిటీ, ర్యాగింగ్​కమిటీలను ఏర్పాటు చేసి పలు దఫాలుగా విచారణ జరిపించారు. ఆ కమిటీల నివేదిక ఆధారంగా ఐదుగురు విద్యార్థులకు పనిష్మెంట్ ​ఇచ్చారు.  

ట్రిపుల్​ఐటీలో ఇద్దరు ఉద్యోగులపై వేటు

బాసర ట్రిపుల్ ఐటీలో  అకౌంట్ సెక్షన్ కి చెందిన ఇద్దరు ఉద్యోగులను వీసీ వెంకటరమణ శుక్రవారం సస్పెండ్​ చేశారు. డ్యూటీలో నిర్లక్ష్యం, యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు బయటకి లీక్ చేస్తున్నారని చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

స్టూడెంట్​ను వేధిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు ఉద్యోగులపై  ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. వేధింపుల విషయమై పూర్తిస్థాయి నివేదిక  అందగానే ఇద్దరు ఉద్యోగులపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.