నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తం.. ఏడాదిలోనే 2 లక్షల జాబ్స్​ భర్తీ చేస్తం

నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తం.. ఏడాదిలోనే 2 లక్షల జాబ్స్​ భర్తీ చేస్తం
  • ఒకటో తారీఖునే ప్రతి మహిళ ఖాతాలో రూ. 2,500
  • ములుగు జిల్లా రామంజపూర్​ సభలో రాహుల్​, ప్రియాంక ప్రకటన
  • రాష్ట్రాన్ని కేసీఆర్​ ఫ్యామిలీ పీక్కుతింటున్నదని మండిపాటు

జయశంకర్​ భూపాలపల్లి/ వెంకటాపూర్​(రామప్ప), వెలుగు : రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మి స్కీం కింద మహిళలకు ప్రతి నెల ఒకటో తారీఖునే రూ.2500 చొప్పున వాళ్ల ఖాతాల్లో జమ చేస్తామని, ఆడబిడ్డల వంటింటి కష్టాలు తీర్చడానికి గ్యాస్​ సిలిండర్​ను రూ.500కే ఇంటికి సప్లయ్​ చేస్తామని కాంగ్రెస్​ అగ్రనేతలు రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. 18 ఏండ్లు నిండిన యువతులకు ఎలక్ట్రిక్​ స్కూటీలు అందజేస్తామన్నారు. 

నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని, ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. రాహుల్​, ప్రియాంక బుధవారం ములుగు జిల్లాల్లోని రామప్ప నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. రామంజపూర్ లో విజయభేరి సభ​వేదికగా మహిళా డిక్లరేషన్​ను ప్రకటించారు. అంతకు ముందు రామప్ప గుడిలో శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామంజపూర్​లో సభకు బస్సులో వచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో సభలో వివరించారు. బీఆర్​ఎస్​ సర్కార్​పై, కేసీఆర్​ తీరుపై నిప్పులు చెరిగారు. 

బీఆర్​ఎస్​కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే: రాహుల్​

కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తనను వేధిస్తున్నదని, ఎంపీ పదవి నుంచి తొలగించడమే కాకుండా తనపై 24 అక్రమ కేసులు బనాయించిందని రాహుల్​ గాంధీ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ గెలుపును అడ్డుకోవడానికి బీజేపీ, బీఆర్​ఎస్​, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని,  బీఆర్​ఎస్​ పార్టీకి ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్​, ఆయన కుటుంబసభ్యులు ప్రభుత్వంలో ఉండి వేలకోట్లు అక్రమ సంపాదన వెనకేసుకున్నా వారిపై ఈడీ, ఇన్​కం టాక్స్​, సీబీఐ వంటి సంస్థలు కేసులు పెట్టవని, ఎందుకంటే సెంట్రల్​ గవర్నమెంట్​లో ఉన్న బీజేపీ పార్టీ పెద్దలకు, సీఎం కేసీఆర్​కు మధ్య లోపాయికారి ఒప్పందాలున్నాయని దుయ్యబట్టారు. 

ఈ రెండు పార్టీలు మిలాఖత్​ కావడం వల్లనే రాష్ట్రంలో పేదలకు తీరని అన్యాయం జరుగుతున్నదన్నారు. కేంద్రం పార్లమెంట్​లో పెట్టే ప్రతి బిల్లును బీఆర్​ఎస్​ పార్టీ ఆమోదిస్తున్నదని తెలిపారు.  ‘‘సెక్యులర్​ పార్టీ అయిన కాంగ్రెస్​ దేశంలో బీజేపీతో పోరాడుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్​ పాలనలో ఉన్న రాజస్థాన్​, చత్తీస్​ గఢ్​ రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. రాజస్థాన్​లో పేదలు, మధ్య తరగతి వాళ్లకు వైద్య ఖర్చుల కింద అక్కడి సర్కారు రూ.25 లక్షల సాయం ఇస్తున్నది. చత్తీస్​ గఢ్​లో రైతుల సంక్షేమం కోసం క్వింటాల్​ వడ్లను రూ.2,500 ఇచ్చి కొంటున్నది. ఇవి దేశంలో ఎక్కడా అమలు కావట్లేదు.

 కర్నాటక రాష్ట్రంలో కూడా మొన్న మేము ఇచ్చిన 5 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే కేబినెట్​ ఆమోదంతో అమలు చేస్తున్నం” అని రాహుల్​ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న ఆరు గ్యారంటీలను కూడా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని తెలిపారు. దేశంలో తాము అధికారంలోకి రాగానే సమక్క, సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తామని చెప్పారు. ఎన్నో కలలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్​ కుటుంబం పీక్కుతంటున్నదని ఆయన  మండిపడ్డారు. 

ఆరు గ్యారంటీల అమలు పక్కా: ప్రియాంక 

రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని ప్రియాంక గాంధీ అన్నారు. మహిళలకు  మహాలక్ష్మి స్కీం కింద ఒకటో తేదీనే రూ.2,500 చొప్పున అందిస్తామని, గృహజ్యోతి స్కీం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంట్​ బిల్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీం పథకం ద్వారా ఇల్లు కట్టుకునేందుకు నిరుపేదలకు రూ.5 లక్షలు అందిస్తామన్నారు. రైతు భరోసా స్కీం ద్వారా రైతులకుఎకరానికి రూ.15 వేల చొప్పున సాయం అందిస్తామని, ఎంఎస్​పీ కంటే అధిక రేట్లకు పంటలు కొనుగోలు చేస్తామని తెలిపారు. 

భూమిలేని నిరుపేద రైతులకు కూడా ఏటా రూ.12 వేల చొప్పున అందిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని, పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని తెలిపారు.  అంబేద్కర్ అభయహస్తం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 12లక్షల చొప్పున అందిస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వివరించారు. యువ వికాసం పథకం కింద రూ. 5లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని వివరించారు. తెలంగాణ గడ్డ ఎందరో వీరులు పుట్టిన గడ్డ అని ఆమె గుర్తుచేశారు.  

స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధిని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, సామాజిక న్యాయం జరుగుతుందని ఆనాడు బీఆర్​ఎస్ కు జనం మద్దతిస్తే.. కలలను కల్లలు చేసిందని అన్నారు. ‘‘రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అందరూ అనుకున్నరు.  కానీ, కేసీఆర్​ సర్కారు కుటుంబ పాలనకే ప్రాధాన్యం ఇచ్చి ఇక్కడ ప్రజల నడ్డి విరిచింది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని  ఏర్పాటు చేసింది. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి మా అమ్మ  సోనియా తెలంగాణను ఏర్పాటు చేశారు. కానీ బీఆర్​ఎస్ పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. మీ ఆకాంక్షలను నెరవేర్చేది కాంగ్రెస్ మాత్రమే” అని ప్రియాంక పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలుచేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకుందని అన్నారు. ‘‘ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన బీఆర్​ఎస్ మాట తప్పింది. 

లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. నిరుద్యోగుల ఆత్మహత్యలపై వ్యక్తిగత కారణాలను చూపి బాధిత కుటుంబాల మరింత బాధపెడ్తున్నది. మొన్న ఓ నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే.. ఆ అమ్మాయి గ్రూప్స్​కే అప్లయ్​ చేసుకోలేదని ఈ ప్రభుత్వ పెద్దలు అంటున్నరు. ఇది ఎంత వరకు కరెక్ట్​” అని ఆమె ప్రశ్నించారు. గల్ఫ్ కుటుంబాలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ‘‘బీఆర్​ఎస్ అంటేనే సాండ్, ల్యాండ్, వైన్ మాఫియా. ఈ మాఫియా నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుతాం.  కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తం” అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.  

జాతీయ ఉత్సవంగా సమ్మక్క, సారక్క జాతర 

కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటది. ఇది ప్రపంచానికి తెలుసు. మేం రాజకీయ స్వార్థం కోసం నిర్ణయాలు తీసుకోం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా మా అమ్మ సోనియా ఆనాడు రాష్ట్ర ఏర్పాటుకే మొగ్గుచూపారు. ప్రజల మంచి కోసం నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో కలలతో ఏర్పడిన రాష్ట్రాన్ని కేసీఆర్​ కుటుంబం పీక్కుతింటున్నది. దేశంలో మేము అధికారంలోకి రాగానే సమ్మక్క, సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తం.

 రాహుల్​గాంధీ

నిరుద్యోగుల గోస కనిపిస్తలేదా?

ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది. లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేస్తలేదు. నిరుద్యోగుల గోస పుచ్చుకుంటున్నది. వారి బాధలను పట్టించుకోకపోగా.. మాటలతో మరింత క్షోభకు గురిచేస్తున్నది. మొన్న ఓ నిరుద్యోగ యువతి(ప్రవళిక) ఆత్మహత్య చేసుకుంటే.. ఆ అమ్మాయి గ్రూప్స్​కే అప్లయ్ చేసుకోలేదని ఈ సర్కార్ పెద్దలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు.  ఇదేం పద్ధతి?.         

 ప్రియాంక గాంధీ

కల్యాణ లక్ష్మి కింద.. రూ.లక్ష, తులం బంగారం: రేవంత్​ రెడ్డి

కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ స్కీం కింద ఇచ్చే రూ.లక్ష నగదుతో పాటు కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు తులం బంగారం కూడా ఇస్తామని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ప్రకటించారు. ‘‘తెలంగాణ ఇస్తామని కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటను సోనియా గాంధీ నేరవేర్చారు. కానీ తెలంగాణలో ఈ బీఆర్​ఎస్​ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడంలేదు. అందుకే ఆరు గ్యారంటీలు అమలు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది” అని తెలిపారు. గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, గిరిజనులకు న్యాయం చేసేది కాంగ్రెస్ సర్కారే అని చెప్పారు. 

తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చినా కేసీఆర్ సర్కార్ చేసిందేమి లేదని మండిపడ్డారు. అమరులు, నిరుద్యోగుల ఆశలను కేసీఆర్ అడియాసలు చేశారని అన్నారు. ‘‘ఎందరో విద్యార్థులు, యువత త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారు. అమరుల త్యాగాలతో సాకారమైన తెలంగాణను ఒక్క కుటుంబం చెరపట్టింది. రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతి, అరాచకం తాండవిస్తున్నది. కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డరు. ఈ అవినీతి పాలనను పాతాళంలోకి తొక్కాలి” అని రేవంత్​ తెలిపారు.