
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం (జూలై 24) పార్లమెంట్ ఆవరణలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలోని ఒక నియోజకవర్గంలో ఈసీ చీటింగ్ చేసిందని.. ఇందుకు సంబంధించిన 100 శాతం ఆధారం తమ పార్టీ వద్ద ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో మేం ఒక నియోజకవర్గాన్ని పరిశీలించగా.. వేల సంఖ్యలో అర్హత లేని కొత్త ఓటర్లను ఈసీ జాబితాలో చేర్చినట్లు గుర్తించామని.. ఇందుకు సంబంధించిన ఎవిడెన్స్ తమ దగ్గర ఉందని ఆరోపించారు.
ALSO READ | మీరున్నది గల్లీలో కాదు.. పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలి.. ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ ఫైర్
కొన్ని నియోజకవర్గాల్లో కొత్త ఓటర్లు 45, 50, 60, 65, వేల మంది వరకు ఉంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు. బీహార్ లో కూడా ఇప్పుడే ఇదే విధమైన మోసానికి ఈసీ పాల్పడుతోందని ఆరోపించారు. రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఈసీ స్వతంత్రంగా తన పని తాను చేయడం లేదని విమర్శించారు. ఎన్నికల సంఘానికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నానని.. ఈ తప్పుల నుంచి మీరు తప్పించుకోలేరు. ఒకవేళ మేం తప్పించుకుంటామనుకుంటే అది మీ పొరపాటే.
తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని వదలిపెట్టమని హెచ్చరించారు రాహుల్ గాంధీ. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ గురించి మీడియా ప్రశ్నించగా పై విధంగా రాహుల్ రియాక్ట్ అయ్యారు. రాహుల్ గాంధీ ఆరోపణలపై ఈసీ రియాక్ట్ అయ్యింది. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని సూచించింది. ఎన్నికల పిటిషన్లపై న్యాయస్థానాల్లో తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని చెప్పింది.